
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ ఒకటి హెలీప్యాడ్‌పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా కూలిపోయింది. గిల్గిట్-బాల్టిస్తాన్ (జీబీ)లోని డైమర్ జిల్లాలో గల చిలాస్‌లోని థోర్ ప్రాంతం సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఐదుగురు మరణించారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
🚨Pakistan govt helicopter crashes in Gilgit-Baltistan region, 5 killed: Report https://t.co/JLyWyCTzFg
— Hindustan Times (@htTweets) September 1, 2025
మృతులలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారని ఆ అధికారి పేర్కొన్నారు. పర్వత పర్యాటక ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన, హెలిప్యాడ్‌పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా అది కూలిపోయిందని డైమర్ జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్ హమీద్ మీడియాకు తెలిపారు. కాగా డైమర్ జిల్లాలోని చిలాస్ ప్రాంతంలో ఈ హెలీకాప్టర్ కూలిపోయిందని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. గత నెలలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఎత్తైన శిఖరాలు, మారుమూల లోయలకు ప్రసిద్ధి చెందిన గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రంగా నిలిచింది.