ప్రపంచానికి ఇదొక శుభవార్త.. ఓజోన్‌ పొర స్వయం చికిత్స

Ozone layer slowly healing, hole to mend by 2066 - Sakshi

2066 నాటికి పూర్తిగా పూడుకుపోనున్న రంధ్రం  

వాషింగ్టన్‌:  వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్‌ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్‌ అసెస్‌మెంట్‌ ప్యానెల్‌ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్‌ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది.

ఓజోన్‌ రంధ్రం 2022 సెప్టెంబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 13 మధ్య సగటున 23.2 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్‌ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్‌ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్‌ ప్రోటోకాల్‌ నిర్ధేశిస్తోంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top