వైరల్‌: పుట్టగానే మాస్కు లాగిపడేసింది!

Old Photo Baby Removing Doctor Mask Became Viral Ray Of Hope - Sakshi

ఒకప్పుడు కేవలం వైద్య సిబ్బంది మాత్రమే అది కూడా ఆస్పత్రిలో, మరీ ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనే సర్జికల్‌ మాస్కులు ధరించే వారు. కర్మాగారాల్లో పని చేసే కార్మికులు కూడా కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు మాస్కులు వాడేవారు. కానీ ఎప్పుడైతే మహమ్మారి కరోనా పంజా విసరడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సామాన్యుల జీవితాల్లోనూ ఇదొక భాగమైపోయింది. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే దాఖలాలు లేకపోవడంతో.. ‘‘చికిత్స కన్నా నివారణే మేలు’’అన్న చందంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ప్రాణాంతక కోవిడ్‌-19 అంతమై, మునుపటి పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..)

యూఏఈకి చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌ చీబ్‌ కూడా ఈ కోవకు చెందిన వారే. గతంలో ఓ డెలివరీ సందర్భంగా ఆపరేషన్‌ థియేటర్‌లో తీసిన ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆయన.. ‘‘త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా’’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. అప్పుడే పుట్టిన చిన్నారి, సమీర్‌ మాస్కును తన చేతితో లాగిపడేయగా, ఆయన చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

‘‘పుట్టగానే మాస్కు తీసి పడేసింది. 2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే. అన్నీ సజావుగా సాగి మనమంతా మాస్కు లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు త్వరలోనే రావాలి. మెరుగైన మన భవిష్యత్తుకు ఈ చిన్నారి ఫొటో ఓ సంకేతంలా కనిపిస్తోంది’’అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చినా, అది పూర్తిగా అంతమైపోదని, కాబట్టి మాస్కు ధరిస్తే కరోనాతో పాటు, ఇతర వైరస్‌లు కూడా సోకకుండా జాగ్రత్త పడవచ్చు’’అంటూ సలహాలు ఇస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top