
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్‌గంజ్‌లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్‌ఖాంగ్‌లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు.
న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు.
‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు.
అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.
దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్‌పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్‌లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.
14వ దలైలామా ఎంపిక తర్వాత..
టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్‌కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.