అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ | New World screwworm disease is an infestation cases in usa | Sakshi
Sakshi News home page

అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ

Jul 12 2025 5:10 AM | Updated on Jul 12 2025 5:10 AM

New World screwworm disease is an infestation cases in usa

న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్‌ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. 

న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌ను సైన్స్‌ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్‌ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్‌ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్‌ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి.

 ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్‌ స్క్రూవార్మ్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి.  

ఎలా నియంత్రిస్తారు?  
స్క్రూవార్మ్‌ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్‌ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్‌ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. 

మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్‌ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్‌–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.  
   
మనుషులకు ముప్పు స్వల్పమే  
పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్‌ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్‌ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement