
నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు జరిపింది. రామెచాప్ జైలు నుంచి పారిపోయేందుకు ఖైదీలు యత్నించగా.. వారిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో పలువురు గాయపడ్డారు. హింసాత్మక నిరసనలు, ఘర్షణల మధ్య ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి సుమారు 7 వేల మంది ఖైదీలు పారిపోయినట్లు వార్తలు రాగా, తాజాగా పారిపోయిన ఖైదీల సంఖ్య 13,000 వేలకు చేరుకున్నట్లు స్థానిక మీడియా వార్త కథనాలు వెల్లడించాయి. ఈ ఆందోళనలతో నేపాల్‌లో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా సంక్షోభంగా మారింది.
ఢిల్లీబజార్ జైలు, ఛిత్వాన్, నఖూ, ఝుంప్కా, కంఛన్‌పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు, గౌర్, బజ్హాంగ్‌లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారిపోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పశ్చిమ నేపాల్‌లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్డన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు. కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలాగోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది. కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది.
