మెగా డీల్‌: ఇరాన్‌కు అమెరికా బంపరాఫర్‌! | Middle East Mega Deal: Trump bumper offer to Iran Says Media Sources | Sakshi
Sakshi News home page

మెగా డీల్‌: ఇరాన్‌కు అమెరికా బంపరాఫర్‌!

May 29 2026 9:23 AM | Updated on May 29 2026 9:31 AM

Middle East Mega Deal: Trump bumper offer to Iran Says Media Sources

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అయితే “మెగా డీల్”లో భాగంగా ఇరాన్‌కు అమెరికా భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఆఫర్లు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం (MoU) దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ అంగీకారం అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశంగా ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.

ఇక మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో.. 

ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఈ డీల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది 300 బిలియన్ డాలర్ల విలువైన “పునర్నిర్మాణ పెట్టుబడి నిధి”. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, అమెరికా కంపెనీలు కూడా ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది.

అయితే ఈ ఫైల్‌ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టేబుల్‌ మీదే ఉందని.. ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే, శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్న ఈ డీల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement