4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా! | Sri Lanka Man Gets 21 Day Jail Term For Keeping Four Litres Of Petrol In Sri Lanka Amid Fuel Shortage | Sakshi
Sakshi News home page

4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!

Mar 28 2026 5:45 AM | Updated on Mar 28 2026 12:32 PM

Man gets 21-day jail term for keeping four litres of petrol

శ్రీలంకలో వింత ఉదంతం 

కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్‌ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.

అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్‌ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్‌ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement