సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి! | India Cuts Excise Duty on Petrol Diesel Global Oil Price Volatility | Sakshi
Sakshi News home page

సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!

Mar 27 2026 9:09 AM | Updated on Mar 27 2026 12:19 PM

India Cuts Excise Duty on Petrol Diesel Global Oil Price Volatility

పెట్రోల్‌ లీటరుపై రూ.10 తగ్గింపు

డీజిల్‌ లీటరుపై ఉన్న రూ.10 పూర్తిగా ఎత్తివేత

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

సుంకాల కోత.. మారని ధరలు!

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్‌ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.

నయారా ఎనర్జీ ధరల పెంపు

దేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్‌నెఫ్ట్‌ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)

ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.

నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)
ఢిల్లీరూ. 94.72రూ. 87.62
ముంబైరూ. 104.21రూ. 92.15
బెంగళూరురూ. 102.84రూ. 88.95
హైదరాబాద్రూ. 107.41రూ. 95.65
చెన్నైరూ. 100.75రూ. 92.34

 

గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.

ఎందుకీ అస్థిరత?

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.

ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement