భార జల కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులు
ఇజ్రాయెల్, గల్ఫ్‌పై ఇరాన్ ప్రతి దాడులు
మరో 10 రోజులు కాల్పుల విరమణ: ట్రంప్
ఇరాన్ కోరినందుకే పొడిగించినట్టు వెల్లడి
ఏప్రిల్ 6కల్లా హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
లేదంటే ఇరాన్ చమురు క్షేత్రాలన్నీ బుగ్గేనని హెచ్చరిక
దుబాయ్: పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించే చర్చల విషయంలో సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇరాన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పడం విశేషం! ‘‘ఏప్రిల్ 6 నాటికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవాల్సిందే. లేదంటే ఆ దేశ ఇంధన క్షేత్రాలన్నింటినీ సర్వనాశనం చేస్తా’’అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఇరుపక్షాలు ముమ్మరంగా దాడులు చేసుకున్నాయి.
ఇరాన్‌లోని యజ్ద్ ప్రావిన్స్‌లో అర్డకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది! సెంట్రల్ ఇరాన్‌లోని ఒక భార జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు 2,500 మంది మరైన్లు, 1,000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్‌కు చేరువవుతున్నాయి. ఇంకో 10 వేల మంది సైనికులను గల్ఫ్‌కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్‌తో చర్చించినట్టు ఈజిప్టు పేర్కొంది.
గల్ఫ్‌లో దాడుల మోత
ఇరాన్‌లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లిపోయాయి. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తారిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ పెద్ద పెట్టున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితానీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుంటాని ప్రకటించింది! బీరూట్‌లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, పొగ కన్పించాయి. దాడులకు ఇద్దరు పౌరులు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కని్పంచారు. గల్ఫ్‌లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైనా ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అష్‌దోద్‌లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదీన్‌లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్‌రా, అల్ ఉదెయ్‌రీ, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్టు కువైట్ తెలిపింది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం. మరోవైపు ఇరాన్‌కు మిత్ర దేశం రష్యా 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపింది.
హార్మూజ్ వద్ద ‘అధికారిక’ంగా టోల్!
త్వరలో చట్టం చేసే యోచనలో ఇరాన్
హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచి్చనట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి.
క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’
ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన ఇరాన్
ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్‌లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. ఇరాన్‌కు దన్నుగా జమ్మూ కశీ్మర్ వాసులు నగదు మొదలుకుని నగల దాకా పలురకాలైన మానవతా సాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపడం తెలిసిందే.
ఎఫ్‌బీఐ చీఫ్ ఈ మెయిల్ హ్యాకింగ్
తమ పనేనన్న ఇరాన్ అనుకూల గ్రూపు
వాషింగ్టన్: ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇది తమ పనేనని హందాలా అనే ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. అందులోని రెజ్యుమేతో పాటు పలు వ్యక్తిగత డాక్యుమెంట్లతో పాటు కాష్ పటేల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవన్నీ కనీసం పదేళ్ల నాటివిగా కనిపిస్తున్నాయి. హ్యాకింగ్‌ను ఎఫ్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.


