పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు | India Cuts Excise Duty on Petrol and Diesel | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు

Mar 28 2026 4:26 AM | Updated on Mar 28 2026 4:26 AM

India Cuts Excise Duty on Petrol and Diesel

ఆయిల్‌ కంపెనీలకే ప్రయోజనం ∙వినియోగదారులకు పరోక్ష లబ్ధి  

లీటర్‌పై రూ.10 చొప్పున కోత  

పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై 

సున్నాకు చేరిన ఎక్సైజ్‌ డ్యూటీ  

డీజిల్‌పై రూ 21.50, ఏటీఎఫ్‌పై రూ.29.50 చొప్పున విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌  

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలాదేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, రిటైల్‌ ధరల పెరుగుదలను అరికట్టినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా తగ్గించడంతో వినియోగదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ పన్ను లీటర్‌కు రూ.13 ఉండగా.. తాజాగా రూ.10 తగ్గించడంతో అది రూ.3కు చేరుకుంది. డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ పన్ను లీటర్‌కు రూ.10 ఉంది. తగ్గింపు తర్వాత సున్నాకు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

రిటైల్‌ ధరలు యథాతథం  
ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్‌ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.24, డీజిల్‌పై లీటర్‌కు రూ.30 చొప్పున నష్టం వస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ పన్ను తగ్గడంతో ఆయిల్‌ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రిటైల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు.

పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రిఫైనరీలకు వచ్చిన లాభాల నేపథ్యంలో 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి, 2024 డిసెంబర్‌లో ఉపసంహరించుకున్న ఎక్స్‌పోర్టు పన్నును ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్‌పై లీటర్‌కు రూ 21.50, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌)పై లీటర్‌కు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని(విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) విధించింది. అయితే, ఈసారి ఓఎన్‌జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ఎలాంటి విండ్‌ఫాల్‌ పన్ను విధించలేదు. 

ఎన్నికల కోసమే ఈ స్టంట్‌: కాంగ్రెస్‌ 
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్‌కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రిటైల్‌ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్‌ 30 దాకా వెయిట్‌ చేయండి’అంటూ జైరామ్‌ రమేశ్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఆ తర్వాత రిటైల్‌ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేలి్చచెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement