పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. ట్రంప్ ఏమో చర్చల ఫలప్రదమవుతున్నాయని ప్రచారం చేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చకుండా యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం విషయంలో ఇరాన్‌ని తక్కువ అంచనా వేశాడనేది కాదనలేని వాస్తవం. ఆయన అనుకున్న విధంగా యుద్ధం కొద్ది రోజుల్లో ముగియలేదు కదా నానాటికీ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో జేడీవాన్స్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం, ఇరాన్‌లో అధికార మార్పుపై ఉన్న అవకాశాలపై నెతన్యాహుకు ఉన్న విశ్వాసం గురించి వాన్స్ ఆయనను నిలదీసినట్లు కథనాలుపేర్కొన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానికి చేసిన ఫోన్‌కాల్‌లో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలడం చాలా సులభమని, యుద్ధం త్వరగా ముగుస్తుందని నెతన్యాహు గతంలో ఇచ్చిన హామీలు తప్పని వాన్స్ మండిపడ్డట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా జేడీ వాన్స్‌ను బలహీనపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఒక సీనియర్ అమెరికా అధికారి ఆరోపించారు. ఇరాన్ ప్రతినిధులు వాన్స్‌లో చర్చలుకే మెుగ్గుచూపుతన్నారని వస్తున్న వార్తలు వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందని ఇది వాన్స్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడితో చర్చలు జరపకపోతే ఎవరితోనూ జరపలేదని ఆయన పేర్కొన్నారు.
అయితే సాధారణంగా జేడీ వాన్స్ విదేశీ యుద్ధాల్లో అమెరికా పాత్రపై వ్యతిరేకంగా ఉంటారు. అయితే గతంలోనూ అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ' విషయంలో తనకు, వాన్స్‌కు మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే గతంలో యుద్ధాల విషయంలో అమెరికా చేసిన తప్పులు పునరావృతం కాకూడదని వాన్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం మరో ముగింపు లేని యుద్ధం కాకూడదని అందుకే నెతన్యాహు దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు.


