రెండు నెలల దాకా నో ఫికర్‌  | No shortage of petrol and diesel in India | Sakshi
Sakshi News home page

రెండు నెలల దాకా నో ఫికర్‌ 

Mar 27 2026 4:02 AM | Updated on Mar 27 2026 4:02 AM

No shortage of petrol and diesel in India

60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయి  

8 లక్షల టన్నుల ఎలీ్పజీతో ఒక నెల మొత్తం గ్యాస్‌ అవసరాలు తీరుతాయి  

ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మనదేశంలో ప్రతి పౌరుడికి ఇంధనం సరఫరా చేయగలం  

దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వసించవద్దు  

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ప్రకటన  

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్‌ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. 

దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్‌ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. 

‘క్యాష్‌ అండ్‌ క్యారీ’వల్ల అంతరాయం నిజమే  
దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. 

చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్‌ అండ్‌ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్‌ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 

150కిపైగా దేశాల నుంచి దిగుమతి  
ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్‌. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్‌ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్‌ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.

ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు  
ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్‌పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement