అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెతతారు. అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో భారీ వ్యయంతో బాల్‌రూమ్ నిర్మించాలన్న ప్రణాళికను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని పట్టించుకోని ఈ చర్యను అసహ్యకరమైందిగా పేర్కొంటూ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.
జాన్ స్టీవర్ట్ నిర్వహించిన ది విక్లీ షో (The Weekly Show) పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హారిస్ ఈ అంశంపై మాట్లాడుతూ ఊగిపోయారు. ‘‘ఆ మనిషి తన ధనిక మిత్రుల కోసమే బాల్‌రూమ్ నిర్మిలించాలనుకుంటున్నారు. ప్రభుత్వం షట్‌డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమేనా ఇది?. అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా? సిగ్గుందా??..
.. అమెరికాలో పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆహార సహాయం(SNAP) నిలిచిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలితో మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి?.. వాళ్ల గురించి ఆ మనిషి కనీసం ఆలోచించరా? అంటూ ఆగ్రహంతో కమలా హారిస్ ఊగిపోయారు(మధ్యలో కోపంతో ఆమె F*** పదం ఉపయోగించారు). వ్యవస్థను కదిలించడం వేరు, దాన్ని నాశనం చేయడం వేరు. ప్రజలు ఆకలితో బాధపడుతున్న సమయంలో ఈ విధమైన ప్రాజెక్టులు అసహ్యకరమైనవి అని అభిప్రాయపడ్డారు.
చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతున్న సమయంలో స్నాప్(SNAP) బెనిఫిట్స్ ముగియబోతున్నాయి. కానీ అధ్యక్షుడు బాల్‌రూమ్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. ఇది అమానవీయం అని కమలా హారిస్ తేల్చేశారు.
SNAP అంటే Supplemental Nutrition Assistance Program. ఇది అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఆహార సహాయ కార్యక్రమం, దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఫుడ్ స్టాంప్స్ లేదంటే EBT కార్డుల ద్వారా నెలకు కొన్ని డాలర్లు అందిస్తారు. ఈ డబ్బుతో వారు ఆహార పదార్థాలు కొనుగోలు చేయగలుగుతారు.
ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ వింగ్‌లోని భాగాన్ని కూల్చేసి అత్యాధునికంగా బాల్‌రూమ్‌ను నిర్మించే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా. అయితే.. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ విరాళాలతోనే కట్టబతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు.
డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హెల్త్ ఇన్సురెన్స్ సబ్సిడీ, ఫారిన్‌ఎయిడ్.. ఇతరత్రా ఫెడరల్ బడ్జెట్ విషయంలో మనీ బిల్లులపై సెనేట్‌లో ఏకాభిప్రాయం(13 సార్లు ఓటింగ్ జరిగినా) కుదరలేదు.దీంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాల్సిన పరిస్థితి అన్నమాట. దీంతో SNAP ఫుడ్ బెనిఫిట్స్, మిలిటరీ పే, ఇతర సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటితో షట్‌డౌన్ 31వ రోజుకి చేరుకుంది. పోలిమార్కెట్ బెట్టింగ్ అంచనాల ప్రకారం, నవంబర్ 16 తర్వాతే షట్‌డౌన్ ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.


