అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు | JD Vance Says ready to serve as US President | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు

Aug 29 2025 8:16 AM | Updated on Aug 29 2025 8:33 AM

JD Vance Says ready to serve as US President

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమెరికాలో భయంకరమైన విషాదం చోటుచేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు జేడీ వాన్స్‌ ప్రకటించారు. దీంతో, ట్రంప్‌కు ఏమైంది?.. అమెరికాలో ఏం జరుగుతోంది? అనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ వాన్స్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాను. అమెరికాలో భయంకరమైన విషాదం చోటుచేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ మంచి ఆరోగ్యంతో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అలాగే, అమెరికా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్‌.. అధ్యక్షుడిగా తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారు. అమెరికన్ ప్రజల కోసం తన పనిని కొనసాగిస్తారు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉపాధ్యక్షుడిగా తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌కు ‘క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ’(దీర్ఘకాలిక సిరల లోపం) అనే వ్యాధి ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. వృద్ధులలో కనిపించే ఈ సమస్య వల్ల కాళ్లలో వాపు వస్తుందని వైద్యులు చెప్పారు. అలాగే ఆయన చేతిపై అయిన గాయాల గురించి స్పందిస్తూ.. కరచాలనాలు, ఆస్పిరిన్ వాడకం వల్లే అలా జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇటీవల కూడా.. ఆయన చేతులపై కనిపిస్తున్న వింత గాయాలు, మచ్చలు ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఆయన కుడిచేతిపై కనిపించిన ఓ తెల్లటి గుర్తు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఆయన కుడిచేతి వెనుక భాగంలో ఒక స్పష్టమైన తెల్లటి గుర్తు కెమెరాల కంటపడింది. ఇది చూసిన చాలామంది, ముఖ్యంగా ఆయన మద్దతుదారులు, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాన్ని కప్పిపుచ్చేందుకే మేకప్‌తో ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలా వరుసగా ఆయన చేతులపై గాయాలు కనిపిస్తుండటంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే, ఈ గాయాలకు గల కారణాలపై ట్రంప్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement