ప్రపంచం దూరమవుతున్నా.. భారత్‌ మా వెంటే | Israel PM Netanyahu Intresting Comments On India Pak Viral | Sakshi
Sakshi News home page

ప్రపంచం దూరమవుతున్నా.. భారత్‌ మా వెంటే

May 29 2026 1:33 PM | Updated on May 29 2026 1:42 PM

Israel PM Netanyahu Intresting Comments On India Pak Viral

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ.. మరోసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్‌కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన  వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్‌తో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్‌కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్‌లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్‌పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్‌లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్‌పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. 

అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా బాట్ నెట్‌వర్క్‌లు కారణమని ఆరోపించారు. “అమెరికన్లలా నటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పరిశీలిస్తే వాళ్లు పాకిస్థాన్‌లోని బేస్‌మెంట్‌ల్లో కూర్చున్నవాళ్లని తేలుతోంది” అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement