4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపైకి క్షిపణులు!
ఒకటి విఫలం, మరోటి కూల్చివేత?
నతాంజ్‌పై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
అణు కేంద్రంపై బాంబుల వర్షం
వచ్చే వారం మరిన్ని దాడులంటూ ప్రకటన
యుద్ధ తీవ్రతను బాగా తగ్గిస్తామన్న ట్రంప్!
ఇరాన్‌ను పూర్తిగా ఓడించామని వ్యాఖ్యలు
కాల్పుల విరమణ ఉండదంటూ మెలిక
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్‌ఎం–3 ఇంటర్‌సెప్టర్‌తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది.
తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్‌లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది.
అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్‌పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్‌పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం.
ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు.
టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి
శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్‌కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్‌లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్‌లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు.
ఇరాన్ ముమ్మర దాడులు
ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్‌లో ఒక కిండర్‌గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్‌లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది.
ఖర్గ్‌లో నౌకపై ఇజ్రాయెల్ దాడి
అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్‌పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్‌పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.
డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను!
తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్‌ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది.


