రష్యాకు బాలిస్టిక్‌ క్షిపణుల సరఫరానా! | Iran Is Supplying Ballistic Missiles to Russia, Blinken Says | Sakshi
Sakshi News home page

రష్యాకు బాలిస్టిక్‌ క్షిపణుల సరఫరానా!

Sep 11 2024 8:02 AM | Updated on Sep 11 2024 11:00 AM

Iran Is Supplying Ballistic Missiles to Russia, Blinken Says

ఆంక్షలు తప్పవంటూ ఇరాన్‌కు అమెరికా, యూకే, జర్మనీ హెచ్చరిక 

లండన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకుగాను రష్యాకు ఇరాన్‌ స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఇందుకు బాధ్యులపై తగు చర్యలుంటాయని హెచ్చరించింది. ఆంక్షల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ ల్యామీ మంగళవారం లండన్‌లో ప్రకటించారు. 

ఇటువంటి ఆయుధాలను రష్యాకు సరఫరా చేయడమంటే సంక్షోభాన్ని పెద్దది చేయడమేనని, దీనిపై తాము ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ఇరాన్‌ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ‘బాలిస్టిక్‌ మిస్సైళ్ల షిప్‌మెంట్‌ రష్యాకు అందింది. మరికొద్ది రోజుల్లోనే వాటిని ఉక్రెయిన్‌పైకి, అక్కడి ప్రజలపైకి రష్యా ప్రయోగిస్తుంది. 

ఈ క్షిపణులను యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉండే లక్ష్యాలపైనా రష్యా గురి పెడుతుంది’అని బ్లింకెన్‌ అన్నారు. ఇందుకు గాను ఇరాన్‌ వైమానిక దళంపై ఆంక్షలు విధిస్తామన్నారు. ఇరాన్‌తో ద్వైపాక్షిక వైమానిక సేవల ఒప్పందం రద్దుతోపాటు బాలిస్టిక్‌ క్షిపణులను ఉత్పత్తి చేసే సంస్థలు, సంబంధిత అధికారులపై ఆంక్షలు విధించనున్నట్లు అనంతరం అమెరికా, బ్రిటన్, జర్మనీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. బ్లింకెన్, ల్యామీ బుధవారం ఉక్రెయిన్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement