అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే  | Iran submits war-ending response to USA proposal via Pakistan mediators | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే 

May 11 2026 5:11 AM | Updated on May 11 2026 8:20 AM

Iran submits war-ending response to USA proposal via Pakistan mediators

ఇరాన్‌ అంగీకారం 

డ్రోన్‌ దాడితో ఖతార్‌ జలాల్లో నౌకకు నిప్పు

దుబాయ్‌/ఇస్లామాబాద్‌: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్‌ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్‌కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్‌కు సమాచారం పంపినట్లు ఇరాన్‌ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. 

ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్‌ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్‌ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్‌–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. 

తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్‌ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్‌ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్‌ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్‌ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్‌ వెల్లడించింది.

 దాడులపై ఖతార్‌ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్‌ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్‌ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్‌దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement