ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం

Published Tue, May 21 2024 4:37 AM

Iran president and foreign minister killed in helicopter crash

హెలికాప్టర్‌ కూలిన ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్‌ తదితరుల మృతి

మహమ్మద్‌ మొఖ్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన అయోతొల్లా

ఐదు రోజులు సంతాప దినాలుగా పాటించనున్న దేశ ప్రజలు

దుబాయ్‌: ఇరాన్‌ తూర్పు అజర్‌బైజాన్‌ పర్వతసానువుల్లో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రాణాలు కోల్పోయా రు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దట్టమైన అటవీప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీరబ్దుల్లాహియాన్‌ (60), ఈస్ట్‌ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ మాలిక్‌ రహ్‌మతీ, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్‌ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. 

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయాతొల్లాహ్‌ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్‌పై గత నెలలో ఇరాన్‌ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరువకముందే రైసీ హఠాన్మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. అయితే రైసీ మరణోదంతంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్‌ సోమవారం స్పష్టంచేసింది. హెలికాప్టర్‌ ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షొయిగు మాట ఇచ్చారు. 

రైసీ మరణం నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మొహమ్మద్‌ మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించారు. ఉపవిదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్‌ కూలడానికి గల కారణాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 

అధ్యక్షుడి మరణవార్త తెలిసి ఇరాన్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదల య్యాయి. ఐదు రోజులు సంతాపదినాలుగా పాటించనున్నారు. లెబనాన్, సిరియా సైతం మూ డ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. భార త్‌ సైతం ఒక రోజు(మంగళవారం)ను సంతాప దినంగా ప్రకటించింది. రైసీ, ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్‌ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువును మష్‌హాద్‌ నగరంలో చేసే అవకాశం ఉంది.

జాడ చెప్పిన తుర్కియే అత్యాధునిక డ్రోన్‌
భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీప్రాంతం కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసినా గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియే తమ అత్యాధునిక నిఘా డ్రోన్‌ను రంగంలోకి దింపింది. అది అడవిలో ఉష్ణాగ్రతల్లో మార్పుల ఆధారంగా సరిహద్దుకు 20 కి.మీ.ల దూరంలోని పచ్చని అటవీప్రాంతంలో హెలికాప్టర్‌ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. ఆ తర్వాతే రైసీ మరణవార్తను ధ్రువీకరించారు. 

సంతాపాల వెల్లువ
రైసీ మరణవార్త తెల్సి చాలా ప్రపంచదేశాలు తమ సంతాప సందేశాలను పంపించాయి. ప్రధాని మోదీ సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ‘‘ రైసీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్‌–ఇరాన్‌ సంబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషి చిరస్మరణీయం. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్‌ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 

ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని మోదీ సోమవారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. లెబనాన్, సిరియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా, టర్కీ, రష్యా, మలేసియా, హౌతీ, ఖతార్, ఇరాక్, పాకిస్తాన్, అజర్‌బైజాన్, పోలండ్, యూఏఈ, వెనిజులా దేశాలు, యూరోపియన్‌ యూనియన్, ఐక్యరా జ్యసమితి, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంతాపం తెలిపాయి. గొప్ప సోదరుడిని కోల్పోయామని లెబనాన్‌ ఉగ్రసంస్థ హెజ్‌బొల్లా, హమాస్‌తో పాటు హౌతీ తిరుగుబాటుదారులు సంతాపం ప్రకటించారు.

నూతన అధ్యక్షుడి   ఎంపిక ఎప్పుడు?
తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్‌ కేవలం 50 రోజులు కొనసాగనున్నారు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్, పార్లమెంట్‌ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటుచేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

ఖైదీల సామూహిక ఉరి ఉదంతంలో ప్రమేయం
మతబోధకుల కుటుంబంలో మస్‌హద్‌ నగరంలో 1960 డిసెంబర్‌ 14న రైసీ జన్మించారు. మోతాహరీ యూనివర్సిటీలో న్యాయవిద్యను చదివారు. 15 ఏళ్ల వయసులోనే ‘ఖ్వామ్‌’లో మతవిద్యను నేర్చుకున్నారు. 1979లో ఇస్లామిక్‌ విప్లవకాలంలో పశ్చిమదేశాల మద్దతున్న ఇరాన్‌ పాలకుడు షాకు వ్యతిరేకంగా ఆయాతొల్లా రుహొల్లా ఖొమేనీ చేసిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 

21 ఏళ్లకే కరాజ్‌ నగర ప్రాసిక్యూటర్‌గా, పాతికేళ్లకే టెహ్రాన్‌ డెప్యూటీ ప్రాసిక్యూటర్‌గా పనిచే శారు. అటార్నీ జనరల్‌ స్థాయికి ఎది గారు. తదనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. అయితే 1988 ఏడాది జూలై–సెప్టెంబర్‌ కాలంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వేలాదిమంది రాజకీయ ఖైదీలను దేశవ్యాప్తంగా సామూహికంగా ఉరితీసిన ఉదంతంలో రైసీ ముఖ్యపాత్ర పోషించారని అమెరికా, ఇతర దేశాలు ఆరోపించాయి. రైసీ 2017లో హసన్‌ రౌహానీతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2021లో మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీచేశారు. 

ఆ ఎన్నికల్లో ముఖ్యమైన ప్రత్యర్థి నేతలందర్నీ అనర్హులు గా ప్రకటించడంతో రైసీ గెలుపు సులువైంది. ఛాందసవాద మత సంప్రదాయాల పేరిట భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళా, మానవ హక్కులను కాలరాశారని ఆయనపై మాయని మచ్చ పడింది. ఈయన మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన కఠిన హిజాబ్‌ చట్టాన్ని అమలుచేస్తూ నైతిక పోలీసులు 2022లో మహ్‌సా అమిని అనే మహిళను కొట్టిచంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 

85 ఏళ్ల ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ భవిష్యత్‌ రాజకీయ వారసునిగా రైసీ పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. హసన్‌ రౌహానీ కాలంలో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని రైసీ మరింత పెంచి అంతర్జాతీయ ఆంక్షలకు గురయ్యారు. పాత, కొత్త ఆంక్షల కారణంగానే కొత్త హెలికాప్టర్లు కొనలేక పాత హెలికాప్టర్ల విడిభాగాలు దొరక్క, మరమ్మతులు చేయలేక చివరకు అదే హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. రైసీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరోవైపు   సంబరాలు!
అతివాద రైసీ మరణవార్త తెల్సి ఇరాన్‌లో ఓవైపు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ‘టెహ్రాన్‌ నరహంతకుడు’ అంతమయ్యాడని వేలాది మంది బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఇరానీయన్లు వేడుకలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు పేల్చుతున్న మీమ్స్, జోక్స్‌కు కొదవే లేదు. ‘హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుణ్ణు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’’ అని అమెరికాలో ఉన్న ఇరాన్‌ పాత్రికేయుడు మసీహ్‌ అలీనెజాద్‌ వ్యాఖ్యానించారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్‌ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement