కాల్పుల విరమణ కోరిన ఇరాన్‌.. ట్రంప్‌ సంచలన ప్రకటన | Iran Denies Trump Claim Iranian President Requested Ceasefire | Sakshi
Sakshi News home page

కాల్పుల విరమణ కోరిన ఇరాన్‌.. ట్రంప్‌ సంచలన ప్రకటన

Apr 1 2026 9:42 PM | Updated on Apr 2 2026 9:45 AM

Iran Denies Trump Claim Iranian President Requested Ceasefire

ఇరాన్‌ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్‌ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్‌ తెరిచే వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్‌ హెచ్చరించారు.

అయితే, ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement