కాల్పుల విరమణ గాల్లో దీపం  | Iran ceasefire is on life support after rejecting unacceptable Says Trump | Sakshi
Sakshi News home page

కాల్పుల విరమణ గాల్లో దీపం 

May 12 2026 4:22 AM | Updated on May 12 2026 4:22 AM

Iran ceasefire is on life support after rejecting unacceptable Says Trump

అది ఎప్పుడైనా ముగిసిపోవచ్చు 

యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్‌ పరోక్ష వ్యాఖ్య

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్‌ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. 

అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్‌ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్‌ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్‌ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్‌ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్‌ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్‌ మాట్లాడారు.

 ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్‌ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్‌ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్‌ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్‌ ఉంది. ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement