అమెరికా దాడులు.. ఇరాన్‌లో కూలిన అతి పెద్ద వంతెన | Iran Biggest Bridge Collapses After Strikes: Trump | Sakshi
Sakshi News home page

అమెరికా దాడులు.. ఇరాన్‌లో కూలిన అతి పెద్ద వంతెన

Apr 3 2026 8:49 AM | Updated on Apr 3 2026 10:37 AM

Iran Biggest Bridge Collapses After Strikes: Trump

పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని..  శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్‌లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి.

ఇరాన్‌ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే.. మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరం కరాజ్‌తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.

దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి’’ అంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని ఆయన హెచ్చరించారు.

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్న ట్రంప్‌.. అమెరికా సైనిక చర్య టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్‌పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ఆయన మరోసారి బెదిరింపులకు దిగారు. మన శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా సాధించిన విజయాల కంటే ఇప్పుడు మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తోంది’’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement