ఇరాన్ రాడార్, డ్రోన్ వ్యవస్థలపై అమెరికా దాడి
కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి
దుబాయ్/వాషింగ్టన్: ఓవైపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపనకు దౌత్యమార్గంలో చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో బాంబులమోత మోగించాయి. గత వారం తమ అత్యాధునిక ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
డ్రోన్లను ప్రయోగించే ప్రయోగకేంద్రాలనూ అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారంతీర్చుకుంది. అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ పేర్కొంది. ‘‘అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న తమ యూఎస్ ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ జలసమాధి చేసింది. అందుకే వాళ్ల రాడార్‌లను మేం నాశనంచేశాం.
డ్రోన్ లాంఛింగ్ సైట్లను బూడిదచేశాం. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హార్మూజ్ జలసంధి గుండా మా రక్షణలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడికి బయల్దేరినా డ్రోన్లనూ నేలకూల్చాం. ప్రతిగా ఇరాన్ మొదలెట్టిన దాడుల్లో మా బలగాలకు, మా సైనిక సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’అని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ సోమవారం ప్రకటించింది.
ఆదివారం గెరూక్, ఖేష్మ్ ద్వీపం మీదా దాడులు చేశామని అమెరికా మిలటరీ పేర్కొంది. అయితే టెలికమ్యూనికేషన్ టవర్ మీద సైతం అమెరికా దాడిచేసిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. దౌత్యం జరుపుతూ దాడులు చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
‘‘మొదట్నుంచీ అమెరికా మమ్మల్ని నమ్మట్లేదు. చర్చలు సైతం అపనమ్మకంతో కొనసాగుతున్నాయి. అవిశ్వాస వాతావరణంలో దౌత్యం ఏనాటికీ కొలిక్కిరాదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ చక్క టి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా మాటిమాటికి బాంబులేయడం మానేసి ఓపికపడితే కుదురుకుంటుంది’’అని ఆయన అన్నారు.
భద్రంగా హార్మూజ్‌ను దాటిన 70 నౌకలు
అమెరికా బలగాల రక్షణంలో గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70 వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధి గుండా పయనించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ జలాలకు అటువైపు, ఇటువైపు ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలిగాయని అమెరికా అధికారులు వెల్లడించారని సోమవారం న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ముందుజాగ్రత్తగా నౌకలన్నీ తమ లొకేషన్‌ను చూపించే ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేశాయని వెల్లడించింది.
అమెరికాతో చర్చలనునిలిపేసిన ఇరాన్!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుండటంపై నిరసనగా అమెరికాతో దౌత్యచర్చలను నిలిపేస్తున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో నిర్ణయించుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులుచేస్తోందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘దాడులకు నిరసనగా ఇకపై మధ్యవర్తులతో తమ దౌత్య ప్రతినిధులు చర్చలు జరపబోరు. తక్షణం లెబనాన్‌పై కాల్పులు, దురాక్రమణను ఇజ్రాయెల్ నిలిపేయాలి.
బీరుట్ ఆక్రమణ ప్రయత్నాలను ఇజ్రాయెల్ విరమించుకోవాలి. ఇప్పటికే ఆక్రమించుకున్న సరిహద్దు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)బలగాలు వెనుతిరగాలి. ఈ దిశగా ఇజ్రాయెల్ తీసుకునే చర్చలతో మేం సంతృప్తి చెందేదాకా మధ్యవర్తులతో చర్చలపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. అప్పటిదాకా చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదు’’అని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొందని ఇరాన్‌లోని మీడియాలో కథనాలొచ్చాయి. బీరుట్ సమీప దహియే జిల్లాపై దాడులను ముమ్మరంచేయాలని సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


