చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా? | Indians Arrest In USA For Theft In Stores | Sakshi
Sakshi News home page

చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?

Nov 2 2025 9:00 AM | Updated on Nov 2 2025 9:08 AM

Indians Arrest In USA For Theft In Stores

చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్‌తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. 

ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్‌గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! 

మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. 

తమ కళకు, టేలెంట్‌కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో,  సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. 

మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.

గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. 
-ఎం.రాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement