అమెరికాలో భారత సంతతి ఫార్మా సీఈఓ హత్య

Indian-origin pharma CEO shot dead by gunman in US for robbery - Sakshi

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృత్యువాత పడ్డారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నారు. 2014 నుంచి అరెక్స్‌ ల్యాబోరేటరీస్‌ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్‌ జాన్‌(27)గా గుర్తించారు.

చదవండి: (మెక్సికోలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య)

శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పార్క్స్‌ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న రీడ్‌ జాన్‌ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో వెంటాడాడు. శ్రీరంగను అనుసరిస్తూ ఇంటిదాకా వచ్చాడు. ఇంట్లోకి రాగానే అతడిపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడికక్కడే కన్నుమూశారు. రీడ్‌ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top