
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి హరీశ్ ధ్వజం
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌లో బాలలపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు, నేరాలు జరుగుతున్నా యని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పి. హరీశ్ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పాక్ ప్రోద్బలంతో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రపంచం మర్చిపోలేదని అన్నారు. వీటన్నింటిని నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి పాక్ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. బాలలపై నేరాలను అరికట్టడానికి అ నుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పి.హరీశ్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. పాకిస్తాన్‌లో పాఠశాలలపై, ప్రధానంగా బాలికల పాఠశాలలపై, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఆరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ సైతం ఈ విషయం వెల్లడించినట్లు గుర్తుచేశారు. పాక్ ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, సొంత దేశాన్ని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగ్రవాదులను ఎగదోయడం మానుకోకపోతే పాకిస్తాన్ మరింత నష్టపోవడం ఖాయమని తేలి్చచెప్పారు.