ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. ఏప్రిల్ 16 రేపు ( గురువారం) ఇరాన్-అమెరికా మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి భారత్ సైతం మధ్యవర్తిత్వం వహించచ్చన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ మాత్రమేన్ననారు.
సెర్గియా గోర్ ఇటీవలే వాషింగ్టన్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్థావించారు. ఇరాన్- అమెరికా యుద్ధం విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహించవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇలా మాట్లాడారు
"పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడంలో భారత్ మధ్యవర్తిత్వాన్ని అమెరికా స్వాగతిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపడంలో ఏదేశాలైనా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆ అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రంప్ ఏ ఒక్క దేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తారు". అని అన్నారు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలు కీలక నేతలతో సమావేశం నిర్వహించానని వారు పలు కీలక విషయాలను ప్రస్థావించారని పేర్కొన్నారు. వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలపై మరో కొద్ది రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత గల హర్ముజ్ జలసంధిని కేవలం ఒక్క దేశం దిగ్భందించిందని ఇది చాలా ప్రమాదకరమని ఇరాన్ పేరు ప్రస్థావించకుండా మాట్లాడారు.
కాగా నిన్న (మంగళవారం) నరేంద్ర మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగింది. " నా స్నేహితుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. యుద్ధ ఉద్రిక్తతల వేళ ఇరు దేశాధినేతల చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది.


