అల్లు అర్జున్‌ హాజరైన ‘ఇండియా డే పరేడ్‌’కు 2 గిన్నిస్‌ రికార్డులు | Sakshi
Sakshi News home page

బన్నీ హాజరైన న్యూయార్క్‌ ‘ఇండియా డే పరేడ్‌’కు 2 గిన్నిస్‌ రికార్డులు

Published Tue, Aug 23 2022 11:11 AM

India Day Parade In New York Set Two Guinness World Records - Sakshi

వాషింగ్టన్‌: భారత్‍కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర‍్వహించారు. అమెరిక, న్యూయార్క్‌లోని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్‌’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్‌గా పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్‌ రెండు గిన్నిస్‌ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్‌ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్‌ఐఏ వెబ్‌సైట్‌లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 

గిన్నిస్‌ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్‌ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రికార్డ్‌లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్‌లోని హుడ్సన్‌ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్‌ఐఏ. మాడిసన్‌ అవెన్యూలో పాన్‌ ఇండియా స్టార్‌ అల్లుఅర్జున్‌, న్యూయార్క్‌ సిటీ మేయర్‌ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్‌ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్‌గా గుర్తింపు లభించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన బన్నీ

Advertisement
 
Advertisement