
ఒప్పుకోకుంటే విదేశీ విద్యార్థులపై నిషేధమే
72 గంటల్లోగా తేల్చుకోండి
ట్రంప్ సర్కారు అల్టిమేటం
గందరగోళంలో 10 వేల మంది విద్యార్థుల భవితవ్యం
వారిలో 788 మంది భారతీయ విద్యార్థులు
ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టే
వాషింగ్టన్: హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ఆంక్షలకు ట్రంప్ సర్కారు మరింగా పదును పెడుతోంది. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి వీలు కల్పించే యూనివర్సిటీ స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్‌ఈవీపీ) సర్టీఫికేషన్‌ను తాజాగా రద్దు చేయడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించాలంటే ఆరు కఠినమైన షరతులను పాటించాలంటూ వర్సిటీపై ఒత్తిడి తెస్తోంది.
‘‘గత ఐదేళ్లలో విదేశీ విద్యార్థులు క్యాంపస్‌లో లేదా వెలుపల పాల్పడ్డ చట్టవిరుద్ధ, ప్రమాదకర, హింసాత్మక కార్యకలాపాలు, ఇతర విద్యార్థులపై లేదా సిబ్బందిపై బెదిరింపులు, క్యాంపస్‌లో లేదా బయట ఇతర క్లాస్‌మేట్స్ లేదా వర్సిటీ సిబ్బంది హక్కులను హరించడం వంటివాటికి సంబంధించిన అన్ని రికార్డులనూ తక్షణం ప్రభుత్వానికి అందజేయాలి. గత ఐదేళ్లలో వలసేతర తదితర విద్యార్థులందరికి సంబంధించిన క్రమశిక్షణ రికార్డులు సమరి్పంచాలి.
క్యాంపస్‌లో వలసేతర విద్యార్థులు నిరసన కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే అందుకు సంబంధించిన అన్నిరకాల ఆడియో, వీడియో ఫుటేజ్‌లు, అధికారిక, అనధికారిక రికార్డులన్నీ సమరి్పంచాలి’’అని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఇందుకు 72 గంటల గడువు విధించింది.
‘‘హింస, యూదు వ్యతిరేకత, క్యాంపస్‌లో చైనా కమ్యూనిస్ట్ పారీ్టతో సమన్వయం వంటి వాటికి హార్వర్డ్ బాధ్యత వహిస్తోంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకునే అర్హత కోల్పోయింది. చట్టాన్ని పాటించడంలో విఫలమైంది. వర్సిటీపై దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే సర్టీఫికేషన్ రద్దు చేశాం’’ అని డీహెచ్‌ఎస్ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అన్నారు. హార్వర్డ్‌కు ఎస్‌ఈవీపీ సర్టీఫికేషన్ రద్దుపై ఫెడరల్ కోర్టు తాజాగా స్టే విధించింది.
వర్సిటీ మారాల్సిందే
ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్‌లో చదువుతున్న 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. వీరిలో 788 మంది భారతీయులున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టీఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులేమీ ఉండవు.
కోర్సుల మధ్యలో ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని నోయెమ్ స్పష్టం చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి హార్వర్డ్‌లో ప్రవేశం దొరికిన 6,800 మంది విదేశీ విద్యార్థులకు కూడా నిరాశ తప్పనట్టే.
చట్ట విరుద్ధం: హార్వర్డ్
ప్రభుత్వానికి ప్రతీకార చర్య అంటూ హార్వర్డ్ మండిపడింది. ‘‘ఇది చట్టవిరుద్ధం. వర్సిటీకి తీవ్ర హాని కలిగించే నిర్ణయం’’అని విమర్శించింది. వర్సిటీకి నిధులను స్తంభింపజేయడం, అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హ క్కును రద్దు చేయడంపై కోర్టులో దావా వేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని, ప్రభుత్వ అధికార పరిధికి మించినదని ఆరోపించింది.
‘‘140 పై చిలుకు దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, పండితులకు ఆతిథ్యమిచ్చే సామర్థ్యం హార్వర్డ్‌ది. దాన్ని సజావుగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విదేశీ ప్రతిభావంతులు వర్సిటీని, దేశాన్ని సుసంపన్నం చేస్తా రు. ప్రభుత్వ ప్రతీకార చర్య వర్సిటీ హార్వర్డ్ విద్య, పరిశోధన లక్ష్యాలను దెబ్బతీస్తుంది. అమెరికాకు కూడా తీవ్ర హాని కలిగించే ప్ర మాదముంది’’అని హార్వర్డ్ ప్రతినిధి జాసన్ న్యూటన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత విద్యార్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నట్టు చెప్పారు.
విమర్శల వెల్లువ
హార్వర్డ్‌పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం (ఎస్‌ఏఏ)తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్‌లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్‌లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్నివిధాలా సాయమందిస్తామని ఎస్‌ఏఏ ప్రకటించింది.
నష్టం అమెరికాకే: భుటోరియా
ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విద్యా సలహాదారు అజయ్ భుటోరియా తీవ్రంగా తప్పుబట్టారు. భారత విద్యార్థుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏకంగా 900 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతోందని ఆయన గుర్తు చేశారు. ‘‘ఇన్నొవేషన్, టెక్నాలజీ, వైద్య తదితర రంగాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం వెనక భారత విద్యార్థుల కృషి ఎనలేనిది.
ఇలాంటి అణచివేత చర్యలను అమెరికన్లు కూడా హర్షించడం లేదు. వారు కోరుకుంటున్నది ఇలాంటి దేశాన్ని కాదు’’అని స్పష్టం చేశారు. ‘‘ప్రతిభావంతులైన భారత విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేదు. వారికి రెడ్‌కార్పెట్ పరిచేందుకు బ్రిటన్, కెనడా తదితర దేశాలు సిద్ధంగా ఉన్నాయి. వారిని ఇలా వెళ్లగొడితే అంతిమంగా తీవ్రంగా నష్టపోయేది అమెరికానే’’అని హెచ్చరించారు. విదేశీ విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్‌లో పోరాడాలని డెమొక్రాట్లకు పిలుపునిచ్చారు.