సైడ్‌ హసల్‌.. వేణ్నీళ్లకు చన్నీళ్లు.. చదువు డబ్బు.. ఒక్క జాబ్‌ కాదు బ్రో!

A growing side hustle trend among Generation Z - Sakshi

జనరేషన్‌ జెడ్‌లో పెరిగిపోతున్న సైడ్‌ హసల్‌ ట్రెండ్‌ 

ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్న యువత  

భారత్‌లో ఏకంగా 51 శాతం మంది సైడ్‌ హసల్‌ చేస్తున్న వైనం 

సొంత ఖర్చుల కోసం కొందరు..హాబీలను నెరవేర్చుకునేందుకు మరికొందరు..

గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఈ ట్రెండ్‌ని సైడ్‌ హసల్‌ అని అంటున్నారు. ఒకవైపు సాధారణ ఉద్యోగాలు చేసుకుంటూనే ఇంకోవైపు పెయింటింగ్, టీచింగ్, సోషల్‌ మీడియా, హాబీల సాయంతో డబ్బులు సంపాదించుకోవడం అన్నమాట. మరీ ముఖ్యంగా ఈ తరం అని చెప్పుకునే జెన్‌–జీలో ఈ ధోరణి ఎక్కువైందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాప్‌ షిప్పింగ్, అమెజాన్‌ రీసెల్లింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, కంటెంట్‌ క్రియేషన్‌.. ఇలా సైడ్‌ హసల్‌కు బోలెడన్ని అవకాశాలు ఉంటున్నాయి.

అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ అంచనాల ప్రకారం గత ఏడాది ఆగస్టు నాటికి ఈ సైడ్‌ హసల్‌ అనేది పతాక స్థాయికి చేరింది. ఇతర వయసులవారూ ఈ పని చేస్తున్నా అత్యధికులు మాత్రం జెన్‌–జీ వారేనని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన మరో అధ్యయనం కూడా జెన్‌–జీ యువతలో కనీసం 48 శాతం మంది ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నట్లు పేర్కొంది.

పేచెక్స్‌ సంస్థ లెక్కల ప్రకారం మిలినియల్స్, బేబీ బూమర్లతో పోలిస్తే సైడ్‌ హసల్‌ చేస్తున్న జెన్‌–జీ యువత చాలా ఎక్కువ. భారత్‌ విషయానికి వస్తే గత ఏడాది డెలాయిట్‌ జెన్‌–జీ, మిలినియల్స్‌పై ఒక సర్వే నిర్వహించింది. దానిలోనూ సైడ్‌ హసల్‌ గురించి జెన్‌–జీని ప్రశ్నించారు. తేలిందేమిటంటే భారత్‌లో సుమారు 51 శాతం మంది సైడ్‌ హసల్‌ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సగటు కేవలం 32 శాతం మాత్రమే కావడం గమనార్హం. 

సుస్మిత వయసు ఇరవై. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. అయితే ఆమె దృష్టి మొత్తం చదువుపైనే లేదు. బెంగళూరులోని ఓ స్టార్టప్‌ 
కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగమూ చేస్తోంది. నెలకు రూ.27 వేల సంపాదనతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటోంది. 
 కుమార్‌ చదివేది ఇంటర్మిడియట్‌. పగలంతా కాలేజీ...సాయంత్రం కాగానే ఫుడ్‌ డెలివరీ బాయ్‌! కాలేజీ ఖర్చులతోపాటు తన సొంత ఖర్చులకు కావాల్సినంత సంపాదన ఉంది ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌లో!  
శ్రీధర్‌ ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగి. కోవిడ్‌ తరువాత ఇంటి నుంచే పని చేస్తున్నాడు. కానీ అతడికి వంటంటే ఇష్టం. ఈ హాబీతో డబ్బులు సంపాదించేస్తున్నాడు శ్రీధర్‌. వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ డెలివరీ చేస్తున్నాడు. 

అదనపు సంపాదనే లక్ష్యం.. 
కోవిడ్‌ ప్రపంచాన్ని చాలా రకాలుగా మార్చేసింది. సైడ్‌ హసల్‌ పెరిగిపోవడం వీటిల్లో ఒకటి. కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే జీవితంలో స్థిరపడిపోయినట్లే అని ఒకప్పుడు అనుకునే వారు. కానీ...ఈ తరం ఈ పాత పద్ధతితో అస్సలు ప్రయోజనం లేదని నిర్ధారించుకుంది. మామూలుగా ఉద్యోగాలు చేసే వారిలో సగం మంది రిటైర్మెంట్‌ తరువాత కనీసం సొంతిల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారన్న అంచనాలు వీరి ఆలోచనలను ప్రభావితం చేశాయి.

అందుకే వీలైనంత వేగంగా అవసరమైనంత డబ్బు సంపాదించాలని వీరు ఒకటికి మించిన ఉద్యోగాలు చేస్తున్నారు. డెలాయెట్‌ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జీవన వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) పెరిగిపోతుండటం తమ సైడ్‌ హసల్‌కు ఒక కారణమని సర్వేలో పాల్గొన్న వారిలో 33% మంది అభిప్రాయపడ్డారు. కేవలం తమ ఖర్చుల కోసమే దాదాపు 40% జెన్‌–జీ యువత కనీసం రెండు ఉద్యోగాలు చేస్తోందని కంతార్‌ అనే డేటా అనలిటిక్స్‌ సంస్థ సర్వే తెలిపింది. 

ఇష్టమైన హాబీల కోసం.. 
తమ హాబీలను కొనసాగించాలనే ఆకాంక్ష జెన్‌–జీలో సైడ్‌ హసల్‌ పెరిగిపోయేందుకు ఇంకో కారణంగా కన్పిస్తోంది. వర్క్‌ ఫ్రం హోం, రిమోట్‌ వర్కింగ్, స్టెకేషన్‌ వంటి వాటివల్ల ఈ తరానికి ఈ తరహా వెసులుబాటు లభిస్తోంది. దీంతో జెన్‌–జీ తరానికి చెందిన కొంతమంది తమ సొంత ఆలోచనలతో వ్యాపారాలు, స్టార్టప్‌లు మొదలుపెట్టి రాణిస్తున్నారు.

యజమానులుగా ఉండాలనే కోరికతో.. 
జెన్‌–జీ యువత సైడ్‌ హసల్‌ మొదలుపెట్టేందుకు ఇంకో కారణం తమకు తాము యజమానులుగా ఉండాలన్న కోరిక. కంపెనీల్లో సాధారణ ఉద్యోగాలు చేస్తూంటే నిర్దిష్ట సమయాల్లో పనిచేయాల్సి ఉంటుందని దీనివల్ల తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని యువత భావిస్తోంది.

ఇలా కాకుండా తమకు నచ్చినట్లు ఉంటూనే అవసరమైనప్పుడు లేదా తీరిక సమయాల్లో మాత్రమే ఫ్రీలాన్సింగ్‌ తరహాలో పనిచేసేందుకు యువత ఇష్టపడుతోంది. ఒకానొక అంతర్జాతీయ సర్వే ప్రకారం జెన్‌–జీ యువతలో 67 శాతం మంది ఫ్రీలాన్సింగ్‌ చేస్తున్నారు లేదా చేయాలని అనుకుంటున్నారు. సాధారణ ఉద్యోగాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న యువతరం 20 శాతం వరకు ఉన్నారు. సుమారు 62 శాతం యువత సొంతంగా వ్యాపారాలు కలిగి ఉన్నారు.  

జెన్‌–జీ అంటే ఎవరు? 
1996 నుంచి 2010 మధ్యకాలంలో పుట్టిన వారిని జెనరేషన్‌–జెడ్‌ (జెన్‌–జీ) అని పిలుస్తారు. 1980– 1995 మధ్య పుట్టిన వారికి జెన్‌–వై లేదా మిలినియల్స్‌ లేదా జెన్‌–నెక్స్‌ట్‌ అని పేరు. 1883 నుంచి 1900 మధ్య పుట్టిన వారిని లాస్ట్‌ జనరేషన్‌ అని, 1901 – 1925 మధ్యపుట్టిన వారిని ద గ్రేట్‌ జనరేషన్‌ అని పిలుస్తారు. తర్వాతి కాలం అంటే 1928– 1945 తరం పేరు సైలెంట్‌ జనరేషన్‌. 1946– 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్‌ అని, 1965– 1980 మధ్య కాలంలో పుట్టిన వారిని జనరేషన్‌–ఎక్స్‌ అని పిలుస్తారు. ఇక జెన్‌–జీ తర్వాతి కాలంలో అంటే 2011– 2025 మధ్య పుట్టిన వారు జెన్‌–ఆల్ఫా కిందకి వస్తారు.

సామాజిక బాధ్యతపైనా దృష్టి 
♦ జెన్‌–జీ యువత కేవలం తమ సంపాదన, బాగోగులపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఆ క్రమంలో సమాజానికి ఉపయోగపడే పనులూ చేయాలని అనుకుంటోందని ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు చెపుతున్నారు. కూడు, గుడ్డ, నీడ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకున్న తరువాత యువత సమాజంపై తమ ప్రభావాన్ని చూపేలా వినూత్నమైన పనులు చేపడుతున్నారని వీరంటున్నారు.

సోషల్‌ మీడియా ఊతం.. 
♦ యువత సైడ్‌ హసల్‌కు సామాజిక మాధ్య మాలు బాగా ఉపయోగపడుతున్నాయి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా లక్షలకు లక్షలు గడిస్తున్న వారి గురించి మనం తరచూ వింటూనే ఉన్నాము. సైడ్‌ హసల్‌ చేస్తున్న యువతలో 72 శాతం మంది నెలకు సుమారు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకూ సంపాదిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సర్వే తెలిపింది. కొత్త కొత్త నైపుణ్యాలను అలవర్చుకునేందుకు ఉడెమి, కోర్సెరా వంటి ఆన్‌లైన్‌ సంస్థలు అవకాశం కలి్పస్తుండటంతో యువత వాటిని వేగంగా అందిపుచ్చుకుంటోంది.

స్వాగతిస్తున్న కంపెనీలు 
♦ చాలా కంపెనీలు ఉద్యోగుల్లో ఈ కొత్త ధోరణికి అలవాటు పడుతున్నాయి. ఆహ్వనిస్తున్నాయి కూడా. యువత ఎక్కువ సంఖ్యలో సైడ్‌ హసల్‌ చేస్తున్న  నేపథ్యంలో కొన్ని కంపెనీలు వారి ఇష్టాఇష్టాలకు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటున్నాయి. సైడ్‌ హసల్‌ ద్వారా ఉద్యోగులు నేర్చుకుంటున్న కొత్త కొత్త నైపుణ్యాలు తమకు ఉపయోగపడవచ్చునని కంపెనీలు భావిస్తున్నాయి. 

భారత్‌లో పాపులర్‌ సైడ్‌ హసల్స్‌... 
♦ కంటెంట్‌ రైటింగ్‌ 
♦ ఆయా రంగాలకు సంబంధించి ఫ్రీలాన్సింగ్‌ 
♦ వర్చువల్‌ అసిస్టెంట్‌ 
♦ ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ 
ఇన్‌ఫ్లుయెన్సర్‌
♦ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
♦ ఫొటోగ్రఫీ.. వ్లాగింగ్‌ 
అఫిలియేట్‌ మార్కెటింగ్‌ 
♦ గ్రాఫిక్‌ డిజైనింగ్‌.. ఫుడ్‌ డెలివరీ 
♦ గ్రాసరీస్‌ డెలివరీ 
♦ కొరియర్‌ బాయ్స్‌  
- కంచర్ల యాదగిరిరెడ్డి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top