
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను తప్పనిసరిగా విధించాలని యునైటెడ్ స్టేట్స్ తాజాగా గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) భాగస్వాములను కోరింది. భారత్, చైనాలు ఉక్రెయిన్‌లో.. మాస్కో యుద్ధ ప్రయత్నాలకు కీలక సహాయకులుగా అమెరికా ఆరోపించింది. శుక్రవారం జీ7 ఆర్థిక మంత్రులతో జరిగిన ఫోను సంభాషణలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌లు వాషింగ్టన్ సుంకాల నిర్ణయాలకు అనుగుణంగా మెలగాలని మిత్రదేశాలను ఒత్తిడి చేశారు. రష్యా ఇంధన ఆదాయాలను తగ్గించడమనే ఏకీకృత విధానం ద్వారా మాత్రమే యుద్ధానికి ముగింపు పలకగలమని వారు పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చే ఆదాయాలను మూలం నుంచే తగ్గించే ఏకీకృత ప్రయత్నంలో భాగంగానే మేము ఆయా దేశాలపై ఆర్థిక ఒత్తిడిని తెస్తున్నామన్నారు. ఈ సందర్బంగా బెసెంట్, గ్రీర్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ చర్చలు.. ఉక్రెయిన్ రక్షణకు మద్దతుగా నిలుస్తూ, రష్యన్ ఆస్తులను దెబ్బతీసే అవకాశంపై దృష్టి సారించాయి. జీ 7లోని భాగస్వామ్యమైన ఉక్రెయిన్ దీర్ఘకాలిక ఆర్థిక పునరుద్ధరణను కాపాడుతూ, మాస్కోపై ఒత్తిడిని కఠినతరం చేయడంలో సభ్య దేశాలు ఐక్యంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత దిగుమతులపై సుంకాలను అదనంగా 25 శాతం మేరకు పెంచారు. మాస్కోతో న్యూఢిల్లీ చమురు వాణిజ్యాన్ని అణిచివేసే ప్రయత్నంలో భాగంగా శిక్షాత్మక సుంకాలను 50 శాతానికి తీసుకువచ్చారు. ఈ చర్య అమెరికా-భారత్ సంబంధాలను, సంక్లిష్టమైన వాణిజ్య చర్చలను దెబ్బతీసింది. అయితే బీజింగ్‌తో సున్నితమైన వాణిజ్య సంధిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చైనా దిగుమతులపై కొత్తగా సుంకాలను విధించలేదు.