మార్చి 24 మంగళవారం రోజు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంపై చర్చలు జరిపారు. అయితే ఈ హైలెవల్ కాల్‌లో టెస్లా అధినేత మస్క్ చేరాడంటూ కథనాలు వచ్చాయి. కాగా తాజాగా భారత్ ఈ అంశంపై స్పందించింది.
ట్రంప్, మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన హైలెవల్ మీటింగ్‌లో ఎటువంటి అధికార హోదా లేని సభ్యుడు రావడంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఎంత బిలియనీర్ అయితే మాత్రం ప్రోటోకాల్ పాటించరా అని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
కాగా తాజాగా దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. "ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలను మేము గమనిస్తున్నాం. మార్చి 24న జరిగిన ఫోన్ సంభాషణ కేవలం ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్యే జరిగింది". అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
కాగా హర్మూజ్ జలసంధి మూసివేతపై ట్రంప్, మోదీ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ పరమైన నిర్ణయాల లోపంతో ట్రంప్, మస్క్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ట్రంప్‌ని మస్క్ బహిరంగంగానే విమర్శించారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం హైలెవల్ ఫోన్‌కాల్ మీటింగ్‌లో మస్క్ చేరాడంటూ వార్తలు రావడం చర్చనీయాంశమైంది.


