అలా చేస్తేనే.. ఇరాన్‌ సంచలన ప్రకటన | Don't Let Our Enemies: Iran Warns Gulf Nations | Sakshi
Sakshi News home page

అలా చేస్తేనే.. ఇరాన్‌ సంచలన ప్రకటన

Mar 28 2026 6:05 PM | Updated on Mar 28 2026 6:31 PM

Don't Let Our Enemies: Iran Warns Gulf Nations

టెహ్రాన్: శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని గల్ప్‌ దేశాలను ఇరాన్‌ హెచ్చరించింది. గల్ఫ్‌ గగనతలాలను యూఎస్‌, ఇజ్రాయెల్‌ వినియోగించుకోకుండా నిషేధం విధించాలని.. తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్‌పై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రతను కోరుకుంటే.. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా-ఇజ్రాయెల్‌లు తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా-ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాం. కానీ మా మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము గట్టిగా సమాధానం ఇస్తాం. గల్ఫ్‌ దేశాలకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు అభివృద్ధి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డల నుండి యుద్ధం చేయనివ్వకండి’’ అంటూ పెజెష్కియాన్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక "దాగుడు స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' నివేదించింది.

మరోవైపు, హార్మూజ్‌ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్‌ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్‌ లిస్ట్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి.  

ఇరాన్‌ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్‌ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్‌ జనరల్‌ కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్‌లకు కూడా ఇలాగే ఇరాన్‌ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement