ఆయన అందమైన, చక్కటి నాయకుడు
అందరూ కోరుకొనే తండ్రిలాంటి వ్యక్తి
నరకం లాంటి కఠినాత్ముడు కూడా..
భారత ప్రధానిపై ట్రంప్ వ్యాఖ్యలు
భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి స్పష్టీకరణ
టోక్యో/సియోల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్–పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్‌లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్ దారికొచ్చిందని, పాక్‌పై దాడులు నిలిపివేసిందని స్పష్టంచేశారు.
కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం
దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్ జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు.


