
కార్లపై 25 శాతం: ట్రంప్
విడి భాగాలు, ట్రక్కులపైనా
భగ్గుమన్న ప్రపంచ దేశాలు
మాపై ప్రత్యక్ష దాడే: కెనడా
తీవ్రంగా ఖండించిన ఈయూ
డబ్ల్యూటీఓకు ఫిర్యాదు: బ్రెజిల్
భారత్‌పైనా గణనీయ ప్రభావం
వాషింగ్టన్/టొరంటో/ఫ్రాంక్‌ఫర్ట్/టోక్యో: ప్రపంచ దేశాలతో టారిఫ్‌ల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారస్థాయికి తీసుకెళ్తున్నారు. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్నిరకాల కార్లపైనా సుంకాలను ఎకాయెకి 25 శాతానికి పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ‘‘కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇది శాశ్వత నిర్ణయం. దీనిపై వెనక్కు తగ్గేదే లేదు’’ అని ట్రంప్ బుధవారం ప్రకటించారు. ‘‘సుంకాలు వద్దనుకునే తయారీ కంపెనీలు అమెరికాలోనే కార్లను తయారు చేసుకుంటే సరి! పైసా కూడా పన్ను కట్టాల్సిన పనుండదు!’’ అంటూ హితవు పలికారు! భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రకటించిన పరస్పర సుంకాలు కూడా ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. దాన్ని ‘విముక్తి దినం’గా అభివరి్ణంచారు.
ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ప్రకటించనున్నారు. కార్లపై సుంకాల పెంపుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తగిన ప్రతి చర్య తప్పదని హెచ్చరించాయి. ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్‌పైనా పడనుంది. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
త్వరలో ప్రతీకార చర్యలు: కెనడా
ట్రంప్ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్ కార్నీ అభివరి్ణంచారు. దీనిబారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ‘అమెరికాతో సంబంధాలపై కేబినెట్ కమిటీ’తో కార్నీ గురువారం అవ్యతసరంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఉన్నపళాన ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్ టారిఫ్‌ల బారినుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే 140 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది రెండో స్థానం.
యూరప్ ఆందోళన
ఆర్థిక మందగమనంతో ఇప్పటికే సతమతమవుతున్న యూరప్ కార్ల పరిశ్రమపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, మెర్సిడెజ్–బెంజ్, వోల్వో, స్టెలాంటిస్ వంటి యూరప్ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ట్రంప్ చర్యను అక్కడి కార్ల దిగ్గజాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అమెరికాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం హెచ్చరించింది.
అందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడినుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాలు, విడిభాగాలు ఎగుమతయ్యాయి. ఇటలీ, జర్మనీ
కార్ల ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్ వాటా కేవలం 2 శాతమే. జపాన్ కార్లకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. దాంతో ట్రంప్ నిర్ణయం గురువారం జపాన్ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగెరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛా వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వరా ట్రంప్ సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందంటూ తూర్పారబట్టారు. ‘‘ట్రంప్ తాను ప్రపంచానికే అధ్యక్షుడినని భావిస్తున్నారు. ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవు’’ అని హెచ్చరించారు. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
అమెరికాపైనా ప్రభావం
ట్రంప్ కార్ల టారిఫ్ నిర్ణయం ప్రభావం అమెరికాపైనా గట్టిగానే పడనుంది. ముఖ్యంగా డెట్రాయిట్ వంటి కార్ల పరిశ్రమ కేంద్రాలకు ఇది కోలుకోలేని దెబ్బే కానుంది. అక్కడి నుంచి ఒక్క కెనడాకే 40 శాతం కార్లు ఎగుమతి అవుతాయి. ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమ నడ్డి విరవడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.
‘‘కార్ల కంపెనీలు తయారీ యూనిట్లు అమెరికా బయటికి తరలి వేలాది మంది ఉపాధి కోల్పోవచ్చు. సరిహద్దులకు రెండు వైపులా చాలా కార్ల కంపెనీలు మూతబడటం ఖాయం. ఏప్రిల్ 2 అమెరికాకు విముక్తి దినమని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఆ దేశం పాలిట వినాశ దినం కాబోతోంది’’ అని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ గవర్నర్ డౌగ్ ఫోర్డ్ చెప్పారు.
2024లో అమెరికా దిగుమతి చేసుకున్న కార్లు, ట్రక్కులు దాదాపు 80 లక్షలు వాటి విలువ24,000 కోట్ల డాలర్లు