ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ సూచన
న్యూయార్క్: స్థానిక అమెరికన్లకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ ప్రసంగాలిచ్చే అమెరికా అధ్యక్షుడి బాటలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ పయనిస్తున్నారు. హెచ్–1బీ వీసాదారులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఉద్యోగాల్లో నియమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని వర్సిటీలకు ఆయన సూచించారు. ఇప్పటికే ఈ మేరకు ఫ్లోరిడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఆదేశించానని ఆయన చెప్పారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఆయన ప్రసంగించారు.
‘‘ ఫ్లోరిడాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హెచ్–1బీ వీసాదారులు స్థానికులను తోసిరాజని అన్ని రకాల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. హెచ్–1బీ వీసాదారులంతా ఒకరకంగా వలస కూలీలు. మధ్యలో బ్రోకర్ల సాయంతో ఇక్కడికొచ్చి బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. వర్సిటీల ఆడిటింగ్‌లో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీల్లో విదేశీయులు అధ్యాపకులుగా, నిపుణులుగా, చివరకు స్విమ్‌కోచ్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. కనీసం స్విమ్‌కోచ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అమెరికన్ పనికిరాడా?. ఇకనైనా వర్సిటీలు ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించుకోవాలి’’ అని డీశాంటిస్ అన్నారు.


