2024 కొత్త కొత్తగా వెల్‌కమ్‌ | Sakshi
Sakshi News home page

2024 కొత్త కొత్తగా వెల్‌కమ్‌

Published Mon, Jan 1 2024 4:47 AM

Compared to our country time when does new year start in some countries - Sakshi

చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్‌లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్‌ జోన్‌ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్‌ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్‌ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్‌కం చెప్తాయో చూద్దామా.. 

► ప్రపంచంలో మొదట పసిఫిక్‌ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్‌ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. 

మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. 

►న్యూజిలాండ్‌.. మనకు సాయంత్రం 4.30 

►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 

►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 

►చైనా, మలేషియా, సింగపూర్‌.. మనకు రాత్రి 9.30 

►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 

►యూఏఈ, ఒమన్‌.. మనకు జనవరి 1 వేకువజాము1.30 

► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట.. మనకు వేకువజామున 3.30 

►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 

►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్‌.. మనకు వేకువన 5.30 

►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 

►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 

►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 

►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 

►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్‌ ఎంజిలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 

►హవాయ్‌.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 

►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 

►బేకర్, హౌలాండ్‌ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 

సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. 
వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. 

►దీనివల్ల పసిఫిక్‌ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్‌లైన్‌ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. 

►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్‌ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. 

►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్‌ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. 

►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది.  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌
 

Advertisement
 
Advertisement