ఆకాశంలో చైనా ఉపగ్రహ సమూహం

Chinese constellation in the sky: Every inch of Earth under surveillance every 10 minutes - Sakshi

భూమిపై ప్రతి అంగుళాన్ని శోధించే సత్తా

బీజింగ్‌: తమ స్నాతకోత్సవం ఫొటోలను ఆకాశం నుంచి తీయించుకోవాలని అనుకున్న ఆ విద్యార్థుల ఆలోచన కార్యరూపం దాల్చింది. భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఉపగ్రహాలకున్న శక్తివంతమైన కెమెరాలు వారి వినూత్న ఆలోచనను నిజం చేశాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని ది చాంగ్‌గ్వాంగ్‌ శాటిలైట్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ ఏడాది జూలైలో చేసిన ఈ ప్రయోగం మిగతా కళాశాల విద్యార్థుల్లోనూ ఆసక్తి కలిగించింది.

దాదాపు 12 వర్సిటీల విద్యార్థులు తమకు కూడా అలాంటి ఫొటోలే కావాలని కోరుతున్నారని అధికార గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. జిలిన్‌ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(సీయూఎస్‌టీ)కి చెందిన 100 మంది విద్యార్థులు సీయూఎస్‌టీ ఐటీ అనే అక్షరాలున్న ఎరుపు, పసుపు కార్డులను పట్టుకుని తమ వర్సిటీ ప్రాంగణంలో వరుసగా నిలబడ్డారు. సరిగ్గా 9.45 గంటలకు ది చాంగ్‌గ్వాంగ్‌ శాటిలైట్‌ కంపెనీ లిమిటెడ్‌(సీజీఎస్‌టీసీ)కు చెందిన జిలిన్‌–1 స్పెక్ట్రమ్‌01, జిలిన్‌–1 వీడియో07 ఉపగ్రహాలు వర్సిటీ ప్రాంగణం మీదుగా వచ్చినప్పుడు తమ కెమెరాలను ఆకాశం నుంచి క్లిక్‌మనిపించాయి.

చైనాలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని వర్సిటీ స్నాతకోత్సవాన్నైనా ఏ సమయంలోనైనా ఆకాశం నుంచి ఫొటోలు తీయగల సత్తా సొంతం చేసుకునేందుకు సీజీఎస్‌టీసీ పథకం సిద్ధం చేసింది. 2030 నాటి ఆకాశంలో చైనా తొలి వాణిజ్య ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం, 138 ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను పంపనుంది. ఇవన్నీ భూ కక్ష్యలో తక్కువ ఎత్తులో ఉంటూ అత్యధిక రిజల్యూషన్‌ కలిగిన స్పష్టమైన చిత్రాలను పంపుతాయి.  ఒక్కోటి 40 కిలోల బరువుండే 138 ఉపగ్రహాల్లో 2015 మొదలుకొని ఇప్పటి వరకు 31 శాటిలైట్లను సీజీఎస్‌టీసీ పంపించింది.

2021 చివరికల్లా మరో 29 ఉపగ్రహాలను పంపనున్నట్లు తెలిపింది. మరో 8 ఏళ్లలో, 2030కల్లా మిగతా 78  శాటిలైట్లను పంపేందుకు భారీగా నిధులను సమీకరించుకుంది. లక్ష్యం పూర్తయితే భూమిపైని ప్రతి అంగుళాన్ని రేయింబవళ్లూ ప్రతి 10 నిమిషాలకోసారి మ్యాపింగ్‌ చేయగలిగే సామర్థ్యం చైనా సొంతమవుతుంది. ఈ ఫొటోలు వ్యవసాయ, అటవీ ఉత్పత్తి సేవలు, పర్యావరణ పరిశీలన, జియోగ్రాఫికల్‌ ప్లానింగ్, ల్యాండ్‌ ప్లానింగ్‌ తదితర రంగాలకు ఎంతో ఉపయోగపడతాయి.

కాగా, జిలిన్‌–1 ఉపగ్రహాలు తీసిన పంపిన చిత్రాలనే పాకిస్తాన్‌ 2020లో చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సౌత్‌ ఏసియా మానిటర్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ చిత్రాల్లో కశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీ సైనిక క్యాంపుల వివరాలున్నాయని తెలిపింది. ఇప్పటికే భారత్‌తో సరిహద్దుల వెంబడి కయ్యానికి కాలుదువ్వుతూ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా..తాజాగా సమకూర్చుకునే సాంకేతికతతో మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. భారత సైన్యం, కదలికలు, సాయుధ సంపత్తి జాడను చేజిక్కించుకుని భద్రతకు ముప్పు కలిగించే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top