నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు | China warns countries not to strike trade deals with US | Sakshi
Sakshi News home page

నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు

Apr 22 2025 6:31 AM | Updated on Apr 22 2025 6:31 AM

China warns countries not to strike trade deals with US

అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా వార్నింగ్‌ 

బీజింగ్‌: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. 

అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది.

 తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. 

జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్‌ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్‌ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement