టైమ్‌ మెషీన్స్‌: ఏయే పనికి ఎంత టైం కేటాయిస్తున్నామంటే!

China Tops In Working Hours And Sleeping Our World In Data - Sakshi

పని, నిద్రలో చైనా వాళ్లే టాప్‌.. మనం ఎక్కడంటే!

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకటే పని.. ఆఫీసు డ్యూటీ, ఇంట్లో పని, షాపింగ్, పర్సనల్‌ పనులు.. ఇలా పొద్దంతా ఏదో ఓ పని చేస్తూనే ఉంటాం. దానికితోడు నిద్రపోయే టైం అదనం. మరి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో జనం ఏ పనికి ఎంత టైం కేటాయిస్తున్నారో తెలుసా? దీనిపై జరిగిన పలు సర్వేలను క్రోడీకరించి.. అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా సంస్థ ఓ నివేదికను రూపొందించింది. 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసువారిని పరిగణనలోకి తీసుకుంది.      – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

90 శాతం ఈ పనులకే.. 
రోజులో ఉండేది మొత్తంగా 1,440 నిమిషాలు. ఇందులో 80 నుంచి 90 శాతం వరకు మనం రెగ్యులర్‌గా ఒకేలా చేసే పనులకే సరిపోతోంది. ఎవరైనా ఓ వ్యక్తి సంపాదన కోసం చేసే వ్యాపారం, ఉద్యోగానికి కేటాయించే టైం, ఇంటికి సంబంధించిన పనులు, తిండి, నిద్ర, టీవీ, ఇంటర్నెట్‌లో గడపడం వంటివి దాదాపుగా రోజూ ఒకేలా (సేమ్‌ ప్యాటర్న్‌లో) ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అయితే సగటున పరిశీలిస్తే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటోందని వెల్లడించింది. 

పని, నిద్ర.. చైనా, ఇండియాల్లోనే ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా సంపాదన కోసం ఎక్కువ సేపు పనిచేయడంలో, బాగా నిద్రపోవడంలో చైనా వాళ్లు టాప్‌లో ఉన్నారు. సంపాదన కోసం పనిచేసే సమయంలో ఇండియా నాలుగో ప్లేస్‌లో ఉండగా.. నిద్రకు సంబంధించి అమెరికాతో కలిసి రెండో స్థానంలో ఉంది. మెక్సికో, దక్షిణ కొరియా, కెనడా, అమెరికా వంటి దేశాల్లోనూ పనికి కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో సంపాదన బాగానే ఉన్నా.. ఇంకా ఎక్కువ డబ్బుల కోసం ఎక్కువ సేపు పనిచేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో జీతాలు/ఆదాయం తక్కువగా ఉండటంతో ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది.  

ఆహారంపై సంస్కృతి ఎఫెక్ట్‌ 
ప్రపంచవ్యాప్తంగా జనం వివిధ పనులకు టైం కేటాయించడంలో ఆయా ప్రాంతాల సంస్కృతి ప్రభావం ఉంటుందని అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా నివేదిక స్పష్టం చేసింది. భిన్నమైన ఆహారాన్ని ఇష్టపడే ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్‌ దేశాల వారు మిగతా దేశాలకన్నా ఎక్కువ సమయాన్ని తినడానికి, తాగడానికి కేటాయిస్తున్నారు. అదే అమెరికాలో ఇందుకోసం ప్రపంచంలోనే అతితక్కువ టైం తీసుకుంటున్నారు. 

ఎంజాయ్‌మెంట్‌ కూడా.. 
సంపాదనకు తక్కువ టైం కేటాయిస్తున్న వారిలో ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, డెన్మార్క్, నార్వే తదిరత యూరోపియన్‌ దేశాల వారే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో నిద్రకు, ఎంజాయ్‌మెంట్‌కు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. టీవీ, ఫోన్, స్పోర్ట్స్, ఫ్రెండ్స్‌ను కలవడం, పారీ్టలకు వెళ్లడం వంటి పనులతో ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఈ దేశాల్లో రోజువారీ పని సమయం, పని దినాల సంఖ్య తక్కువగా ఉండటం కూడా వారు సంపాదనకు తక్కువ టైం ఇవ్వడానికి కారణమని నివేదిక వెల్లడించింది. 

ఇంటిపని, షాపింగ్‌లో మెక్సికో, ఇండియా.. 
ఇంట్లో ఎప్పుడూ ఏదో ఓ పని ఉంటూనే ఉంటుంది. దానికితో డు ఇంటి అవసరాలకు షాపింగ్‌ కూడా అవసరమే. ఇలా ఇంటికోసం సమయం కేటాయించడంలో మెక్సికో, ఇండియా టాప్‌ లో నిలిచాయి. సాధారణంగానే ఈ రెండు దేశాల్లో సంస్కృతి ఇంటిపనికి కాస్త ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇంటి పనికి యావరేజ్‌గా టైమిస్తే.. దక్షిణ కొరియా, నార్వేల్లో మాత్రం తక్కువగా కేటాయిస్తున్నారు. 

సేవలో ముందున్న ఐర్లాండ్‌ 
రోజుకు 24 గంటలు.. 1,440 నిమిషాలు.. చిన్నాపెద్ద, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉండే టైం ఇంతే. కానీ కొందరు తమకున్న సమయంలోనే కొంత ఇతరులకు సేవ చేయడానికి కేటాయిస్తుంటారు. ఈ విషయంలో ఐర్లాండ్‌ వాసులు అందరికన్నా ముందున్నారు. ఫిన్లాండ్, నార్వే, అమెరికా తదితర దేశాల వారూ కాసేపు వాలంటరీ వర్క్‌ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్రెంచ్‌ వాళ్లు అందరికన్నా వెనుక ఉండగా, ఆ తర్వాత ఇండియన్లే ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top