అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టాం: చైనా

China Military Drove Away US Warship in South China Sea - Sakshi

పారాసెల్స్‌ దీవుల్లో అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధనౌక

రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దంటూ డ్రాగన్‌ ఆర్మీ సూచన

బీజింగ్‌: తమ దేశ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టినట్లు చైనా మిలిటరీ ప్రకటించింది. వివాదాస్పదమైన పారాసెల్ దీవులకు సమీపంలో సోమవారం చైనా జలాల్లోకి అమెరికా యుద్ధనౌక చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు డ్రాగన్‌ దేశం తెలిపింది. దక్షిణ చైనా సముద్ర జలాలాపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు వెల్లడించిన ఐదేళ్లకు చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. 

అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ బెన్‌ఫోల్డ్‌ యుద్ధ నౌక చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా పారాసెల్స్‌ జలాల్లోకి ప్రవేశించిందని చైనా ఆర్మీ పీఎల్‌ఏ సదరన్‌ థియేటర్‌ కమాండర్‌ తెలిపారు. అమెరికా చర్యలు చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక దక్షిణ చైనా సముద్రం స్థిరత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపించించారు. అమెరికా తక్షణమే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని కమాండర్‌ ఓ ప్రకటనలో కోరారు. 

చైనా ఆరోపణలు అవాస్తవం: అమెరికా
చైనా ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు అగ్ర రాజ్య విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, పారాసెల్స్‌ దీవుల పరిసరాల్లో మా యుద్ధ నౌక సంచిరించింది. చైనా సార్వభౌమాత్వానికి భంగం కలిగించామనడం పూర్తిగా అవాస్తవం. అంతేకాక అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన ప్రతి చోట అమెరికా ఎగురుతుంది, ప్రయాణిస్తుంది.. పనిచేస్తూనే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. 

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పట్టించుకోని చైనా
చైనాలో జిషాగా పిలిచే పారాసెల్స్‌ ప్రాంతం వందలాది ద్వీపాలు, కోరల్‌ దీవులు, సముద్ర సంపదకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంపై తమకే హక్కుందని చైనా, వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రూనే దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 1970 లలో హైనాన్ ద్వీపానికి ఆగ్నేయంగా 220 మైళ్ళు (350 కిలోమీటర్లు), 250 మైళ్ళు (వియత్నాంకు 400 కిలోమీటర్లు) బంజరు ద్వీపాల గొలుసు అయిన పారాసెల్స్‌ను చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని వియత్నాం తమదిగా చెప్పుకుంటుంది. అక్కడ దీన్ని హోంగ్‌ సా అని పిలుస్తారు. అలానే తైవాన్‌ కూడా దీనిపై తమకే హక్కుందని ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రాంతం గుండా ఏదైనా సైనిక నౌక ప్రయాణించే ముందు మూడు దేశాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలి. 

అయితే ఈ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్‌ 2016, జూలై 12న సంచలన తీర్పు ఇచ్చింది. చైనా నైన్‌-డాష్‌ లైన్‌గా పిలుచుకునే పారాసెల్స్‌ ప్రాంతంపై బీజింగ్‌కు చారిత్రతకంగా ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందని.. రెడ్‌ బ్యాంక్‌ వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్‌ చేస్తూ.. ఫిలిఫ్పీన్స్‌ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top