China BBC Ban‌: చైనాపై యూ​కే, యూఎస్‌ ఫైర్‌

China bans BBC from broadcasting US UK condemn  - Sakshi

బీబీసీ వ‌రల్డ్ న్యూస్‌ను నిషేధించిన చైనా

మానవ హక్కుల ఉల్లంఘనలపై 'తప్పుడు రిపోర్టింగ్' : చైనా

బీజింగ్‌: మీడియా మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించిన ఆరోపణలపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీపై చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బీబీసీ వ‌రల్డ్ న్యూస్ ప్ర‌సారాల‌ను నిషేధం విధిస్తున్నట్టు చైనా ప్ర‌భుత్వం  ప్రకటించింది.  ఈ మేర‌కు  చైనా టీవీ అండ్‌ రేడియో రెగ్యులేటరీ గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చైనాకు చెందిన చైనా గ్లోబ‌ల్ టెలివిజ‌న్ నెట్ వ‌ర్క్(సీజీటీఎన్) ప్ర‌సారాల‌ను బ్రిటీష్ మీడియా రెగ్యులేట‌రీ సంస్థ ఆఫ్‌కామ్ ఇటీవ‌లే నిలిపివేసిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది. సీజీటీఎన్ మీడియా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా లైసెన్సులు పొందింద‌ని  రెగ్యులేట‌రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

బీబీసీ తమ విదేశీ మీడియా నియ‌మ‌, నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నాయ‌ని, చైనాపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని చైనా ఆరోపించింది.  తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై 'తప్పుడు రిపోర్టింగ్' చేస్తోందని మండిపడింది. వీగ‌ర్ ముస్లింలు, క‌రోనావైర‌స్ విష‌యంలో బీబీసీ కథనాలను చైనా ప్ర‌భుత్వం త‌ప్పుబ‌ట్టింది. వార్తలు నిజాయితీగా, నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలి తప్ప, చైనా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని వ్యాఖ్యానించింది.  ఈ క్ర‌మంలోనే చైనా స్టేట్ ఫిల్మ్‌, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఆర్‌టిఎ)  బీబీసీని బ్యాన్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

మరోవైపు చైనా నిర్ణ‌యంపై బీబీసీ తీవ్ర నిరాశ‌ వ్యక్తం చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ బీబీసీ అనీ, ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా తమ మీడియా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తుంద‌ని బీబీసీ యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది. అటు యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకించారు. "మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొన్నారు. చైనాలో బీబీసీ నిషేధాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చైనాలో మీడియా అణిచివేత‌కు గుర‌వుతోంద‌ని అమెరికా హోంశాఖ‌ వ్యాఖ్యానించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బయట ఫ్రీ మీడియాను వాడుకుంటున్న చైనా తమ దేశంలో ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top