జపాన్‌లో పుష్పవిలాసం.. రాలేటి పూలు రాగాలు పలికిస్తుంటే, పూసేటి పూలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటే..

Cherry Blossom 2023 starts in Japan - Sakshi

రుతువులు మారే వేళ..    ప్రకృతి వింత అందాలను సంతరించుకున్న వేళ..  
నింగిలోని కోటి తారలే నేలపై పూలై విరబూసే సమయాన.. ఒక పండుగ శోభ మది మదిని ఆహ్లాదపరుస్తుంది.  
రాలేటి పూలు రాగాలు పలికిస్తుంటే, పూసేటి పూలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటే   తెలుగువారు ఆమని పాడవే హాయిగా అని పాటలు పాడుకుంటారు.

అదే జపాన్‌లో అయితే చెర్రీ బ్లాసమ్‌ (సకుర) చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది చెర్రీ బ్లాసమ్‌ సీజన్‌ జపాన్‌ను ముందుగానే పలకరించింది. జపాన్‌ దేశవ్యాప్తంగా చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఎక్కడంటే అక్కడే కనిపిస్తాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ చెట్లు విరగబూస్తాయి. కానీ ఈ ఏడాది పది రోజుల ముందే చెర్రీ బ్లాసమ్స్‌ పూసాయి.  రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు నిండా తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.

కొన్ని చెట్లకు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా పూలు పూస్తాయి. ఈ పూలు కేవలం 15 నుంచి నెల రోజుల వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నేల రాలిపోతాయి. అందుకే ఈ సీజన్‌లో జపాన్‌లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చెర్రీ బ్లాసమ్‌ని మహోత్సవంలా నిర్వహిస్తారు. దీనినే హనామీ ఫెస్టివల్‌ అంటారు. ఇది జపాన్‌ జాతీయ పండుగ. వెయ్యేళ్ల క్రితం నుంచే హనామీ ఉత్సవాలు జపాన్‌ నేలపై జరుగుతున్నాయి.

ఈ సీజన్‌ ఎందరో కవుల హృదయాలను తట్టి లేపి దేశానికి అమృతంలాంటి కవిత్వాన్ని పంచి ఇచ్చింది. ఈ సీజన్‌లో ప్రజలు తమ  బాధలన్నీ మర్చిపోయి రోజంతా చెట్ల కింద ఆడుకుంటారు. పాడుకుంటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. తింటారు. తాగుతారు. అక్కడే సేద తీరుతారు. పార్కులు, రోడ్డుకిరువైపులా చెర్రీలు కనువిందు చేస్తుంటే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చీర్స్‌ చెప్పుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. చైనా, కొరియా, తైవాన్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఉన్నప్పటికీ జపాన్‌లో చేసినట్టుగా ఒక పండుగలా వైవిధ్యభరితంగా మరెవరూ చేయరు.  

ఆహ్లాదంతో ఆదాయం
ఈ పండుగ జపాన్‌ వాసులకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు ఆదాయాన్ని కూడా భారీగా సమకూరుస్తుంది. ఈ సీజన్‌లో జపాన్‌కి పర్యాటకులు పోటెత్తుతారు. గత రెండు మూడేళ్లుగా కరోనా మహమ్మారితో ఈ పండుగ కాస్త కళ తప్పింది. ఈ ఏడాది అన్ని భయాలు తొలగిపోవడంతో జపాన్‌ వాసులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు కొన్ని ప్రాంతాల్లో  ఈ చెట్లు పూస్తే, దేశానికి ఉత్తరాదివైపు ఉండే హిరోసాకి వంటి నగరాల్లో మేలో పూలు పూస్తాయి. ఈ సీజన్‌లో చెర్రీ చెట్లు దేశ ఖజానాకు 61,580 కోట్ల యెన్‌ల ఆదాయం తెచ్చిపెడతాయి. ఈ సమయంలో జపాన్‌కు ఏటా 23 లక్షల విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

ఈ సారి జపాన్‌కు బుకింగ్స్‌ గతం కంటే 70 శాతం ఎక్కువయ్యాయని ట్రావెలింగ్‌ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. హనామీ పండుగలో పాల్గొనడానికి ముందస్తు బుకింగ్‌లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. టోక్యోలో ప్రధాన కంపెనీలు దేశ విదేశాల్లోని తమ ప్రతినిధుల్ని చెర్రీ పిలిచి చెట్ల కిందే పార్టీలు చేసుకుంటాయి. అయితే ఈ చెట్లను ముందుగానే ప్రభుత్వం దగ్గర బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది! అలాగాక అప్పటికప్పుడు చెట్ల కింద పార్టీ చేసుకుందామంటే దొరకడం కష్టమే!! ఈ సీజన్‌లో జపాన్‌లో ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ కంపెనీల ఆదాయం ఓ రేంజ్‌లో ఉంటుంది. అవును మరి.. చెర్రీ అంటే ఏమనుకున్నారు. ఫ్లవర్‌ కాదు పవర్‌....!!

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top