సందిగ్ధత నడుమ శాంతి  | Ceasefire at risk over Israel attacks in Lebanon | Sakshi
Sakshi News home page

సందిగ్ధత నడుమ శాంతి 

Apr 10 2026 5:27 AM | Updated on Apr 10 2026 5:46 AM

Ceasefire at risk over Israel attacks in Lebanon

సెంట్రల్‌ బీరూట్‌లో ఇజ్రాయెల్‌ దాడిలో ధ్వంసమైన భవనం శకలాల వద్ద క్షతగాత్రుల కోసం గాలిస్తున్న లెబనాన్‌ సివిల్‌ డిఫెన్స్‌ వర్కర్లు

లెబనాన్‌పై కాల్పులు, హార్మూజ్‌లో నౌకాయానంపై స్పష్టతలేకుండానే కొనసాగుతున్న కాల్పుల విరమణ

లెబనాన్‌తో నేరుగా చర్చలకు సిద్ధమన్న ఇజ్రాయెల్‌ 

హెజ్‌భొల్లా ఆయుధాలు విడనాడాలన్న నెతన్యాహూ 

శనివారం పాకిస్తాన్‌లో మొదలుకానున్న చర్చలు 

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో 303కు పెరిగిన మరణాలు

దుబాయ్‌/ఇస్లామాబాద్‌/బీరూట్‌/వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్‌ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్‌పై దాడులుచేస్తే హార్మూజ్‌ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్‌ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్‌ ప్రపంచప్రజలను వేధిస్తోంది. 

కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్‌ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్‌ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్‌ గల్ఫ్‌ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్‌ గురువారం ప్రకటించాయి. 

పాకిస్తాన్‌లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్‌ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్‌ మంత్రులను ఆదేశించా. 

లెబనాన్‌లో హెజ్‌బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్‌పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్‌తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్‌లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబారి యేషెల్‌ లీటెర్, లెబనాన్‌లో అమెరికా రాయబారి మైఖేల్‌ పాల్గొంటారని తెలుస్తోంది.  

మా వేలు ట్రిగ్గర్‌మీదే ఉంది.. 
కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్‌ పేరు చేర్చినా ఇజ్రాయెల్‌ దాడులు ఆపకపోవడంపై ఇరాన్‌ మండిపడింది. లెబనాన్‌పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఖలీబాఫ్‌ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో బఘేర్‌ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 లెబనాన్‌ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్‌ ట్రిగ్గర్‌పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్‌ రకం చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం.  

చర్చల అంశాలపైనా సందిగ్ధత 
చర్చల్లో ఇరాన్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్‌ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్‌ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్‌ డిమాండ్‌చేసే వీలుంది. 

ఇరాన్‌ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్‌ అడ్డుచెప్పే అవకాశముంది.  ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. 

‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్‌తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్‌లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్‌ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్‌ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్‌తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్, ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్‌లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది.  

శిథిలాల దిబ్బ... 
బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్‌బొల్లా నేత నయీం ఖాసిమ్‌ సన్నిహితుడు అలీ యూసుఫ్‌ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

సముద్ర మందుపాతరలతో జాగ్రత్త 
సరకు రవాణా నౌకలకు ఇరాన్‌ సూచన 
సీమైన్స్‌ అమర్చిన ప్రాంతం ‘చార్ట్‌’విడుదల
దాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్‌ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్‌ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్‌ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. 

నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్‌ జోన్‌) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్‌ ప్రకటించింది. చార్జ్‌ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్‌ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్‌ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్‌ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్‌కు దగ్గరగా లరాక్‌ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది.  

మేం ఇరాన్‌ చుట్టూతే ఉంటాం: ట్రంప్‌
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఆయన గురువారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్‌ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్‌ అన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement