
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ 2025, అక్టోబర్ రెండవ వారంలో భారత్‌లో తన తొలి అధికారిక పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2025, జూలైలో రెండు దేశాలు చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా)పై సంతకం చేసిన తరువాత ఈ పర్యటన జరుగుతోంది.
మూడేళ్లకు పైగా చర్చలు సాగిన దరిమిలా కుదిరిన ఈ ఒప్పందంలో బారత్-యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 120 అమెరికా బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్యం, సాంకేతిక, రక్షణ రంగాలపై చర్చించనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందడుగు వేస్తున్నాయి.
బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పర్యటన భారత్-యుకె సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలను విస్తరించడానికి దోహదపడనుంది. గత ఏడాది జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ భారతదేశంలో చేయబోయే తొలి పర్యటన ఇది. ఇరు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలకు ఈ పర్యటన దోహదపడునున్నదని నిపుణులు భావిస్తున్నారు.