
యూనస్‌కు ఆర్మీ జనరల్ వార్నింగ్
దెబ్బకు తాత్కాలిక సారథి యూ–టర్న్
బంగ్లాదేశ్‌లో బయటపడుతున్న లుకలుకలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడం మండిపడింది. అది ‘బ్లడీ కారిడార్’అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగ్లాదేశ్‌లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ, లౌకిక వ్యవస్థ సైన్యం. దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవలి కాలంలో అసహనంతో ఉంది. విషయం తెల్సుకున్న యూనస్ ప్రభుత్వం సైన్యంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది’అని పరిశీలకులు అంటున్నారు.
వకారుజ్జమాన్ ఏమన్నారు?
రఖైన్ కారిడార్‌ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ‘దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలుపంచుకోదు. ఎవరినీ అలా చేయనివ్వదు’అని ఆర్మీ చీఫ్ బుధవారం యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగిచ్చారు. ‘దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ విషయమైనా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి’అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ‘సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికల జరపాలి. మిలటరీ అంశాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన యూనస్‌ను కోరారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
ఏమిటీ కారిడార్..?
బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్ ప్రాంతం నుంచి మయన్మార్‌లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న రఖైన్ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన మార్గమే రఖైన్ కారిడార్. ఈ నడవా ఏర్పాటు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి నుంచి అందిన వినతిపై యూనస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సైన్ ఇటీవల చేసిన ప్రకటనే ఈ అసంతృప్తి జ్వాలకు ఆజ్యం పోసింది. యూనస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), కొన్ని వామపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవ్యతిరేకమంటూ మండిపడ్డాయి.
ప్రజల ప్రయోజనాలకు గాలికొదిలేసి విదేశీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఎలాంటి నిర్ణయమైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్‌లో చర్చించి తీసుకోవాలని పేర్కొంది. ఏదేమైనా, తాత్కాలిక ప్రభుత్వం కారిడార్ ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. చైనాకు చెక్ పెట్టే ఎత్తుగడతోనే అమెరికా ప్రభుత్వం చేసిన ఒత్తిడులకు యూనస్ లొంగిపోయారని పరిశీలకులు అంటున్నారు. మానవీయ సాయం పేరుతో బంగ్లాదేశ్‌లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, సైనిక, నిఘా పరమైన అవసరాలకు దీనిని వాడుకునే అవకాశముందని ఢాకా ట్రిబ్యూన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారిడార్ ఏర్పాటైతే బంగ్లాదేశ్‌తోపాటు మయన్మార్ సార్వభౌమత్వమూ ప్రమాదంలో పడుతుందని తన కథనంలో పేర్కొంది.
తాజా నిర్ణయమేమంటే..
ఆర్మీ చీఫ్ హెచ్చరికలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో యూనస్ సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించే ఖలీలుర్ రహా్మన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. రఖైన్ కారిడార్ గురించి తమ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని, ఇకముందు కూడా చర్చించదని స్పష్టం చేశారు. ‘దేశ సరిహద్దులకు సమీపంలోని రఖైన్ ప్రాంత వాసులకు మానవతా సాయం అందించే విషయంలో వీలుంటే సాయం చేయాలని మాత్రమే ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకుంటామని మాత్రం చెప్పాం’అంటూ మాటమార్చారు. అంతకుముందు, ఏప్రిల్‌లో ఆయన..‘రఖైన్ కారిడార్ ఏర్పాటుపై ఐరాస ప్రతిపాదనకు ప్రభుత్వం షరతులతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఆ షరతులేమిటో ఆయన వివరించలేదు.