ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. రంగంలోకి బండి సంజయ్‌

Bandi Sanjay Appeals To Jaishankar For Safe Of Karimnagar Students Stuck In Ukraine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ భయానక వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన కడారి సుమాంజలి అనే విద్యార్థిని ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ సమీపంలోని బోరిస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మరో 20 మంది విద్యార్థులు సైతం విమానాశ్రయంలోనే ఉండిపోయారని పేర్కొన్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించారని పేరెంట్స్‌ ఎంపీని కోరారు. 

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌.. భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు సమాచారం అందించారు.  కరీంనగర్‌ విద్యార్థిని సుమాంజలి, ఆమె స్నేహితులు( శ్రీనిధి, రమ్యశ్రీ, లిఖిత)తో పాటు తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ చిక్కుకున్నారని తెలిపారు. కాగా, ఈ నలుగురు విద్యార్ధులు భారత్‌కు తిరిగి వచ‍్చేందుకు ఎయిరిండియా ఫ్లైట్ (AI-1946) కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారని చెప్పారు. కానీ, వీరు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి, అధికారులు ఎయిర్‌పోర్టును మూసివేశారు, ఫలితంగా వారందరూ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దీంతో వారు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తెలంగాణకు చెందిన విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.

సంజయ్ లేఖకు స్పందిస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్టు వెల్లడించారు. విద్యార్థులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top