
15 మంది మృతి, 30 మందికి గాయాలు
క్వెట్టా: పాకిస్తాన్‌లోని కల్లోలిత బలూచిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని స్టేడియంలో మంగళవారం రాత్రి బలూచిస్తాన్ నేషనల్ పారీ్ట(బీఎన్‌పీ) ర్యాలీ నిర్వహించింది. అదే సమయంలో పార్కింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
ఈ సభకు 120 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని బలూచిస్తాన్ మంత్రి మహ్మద్ కకర్ చెప్పారు. అందువల్లే సభాప్రాంగణంలోకి బాంబర్ రాలేకపోయాడన్నారు. ర్యాలీకి 200 అడుగుల దూరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని, అదే జనం ఉన్న చోటుకు బాంబర్ చేరుకునుంటే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదన్నారు. ఘటనకు తమదే బాధ్యతంటూ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
2021లో చనిపోయిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అతావుల్లా మెంగాల్‌ను సంస్మరించుకునేందుకు బీఎన్‌పీ ఈ ర్యాలీ చేపట్టింది. పేలుడు ఘటనను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. బలూస్తాన్‌లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆరోపించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోని అతిపెద్ద, అత్యంత నిరుపేద ప్రావిన్స్.
ఇస్లామిక్ స్టేట్, ఇతర వేర్పాటువాద గ్రూపులు తరచూ పాల్పడే హింసాత్మక ఘటనలకు సాధారణ పౌరులు బలవుతున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇస్లామిక్ స్టేట్ సంస్థ బలూచిస్తాన్‌లోని ఎన్నికల కార్యాలయాలే చేపట్టిన బాంబుదాడుల్లో 20 మంది చనిపోగా డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. నవంబర్‌లో క్వెట్టాలోని రైల్వే స్టేషన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) జరిపిన బాంబు దాడిలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బలూచ్ రాజకీయ ఖైదీల విడుదల డిమాండ్‌తో మార్చిలో బీఎల్‌ఏ 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్ చేయడం తీవ్ర సంచలనం రేపింది.