 
													వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.
డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది.
ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
